అడవినే నమ్ముకుని ఆగమైపోతున్న చెంచులు

అడవినే నమ్ముకుని ఆగమైపోతున్న చెంచులు
  • అటవీ ఉత్పత్తుల సేకరణకు అడ్డు తగులుతున్న ఫారెస్టోళ్లు
  • అడవిలోకి పోకుండా ఎక్కడికక్కడ చెక్​పోస్టులు
  • కోర్​ ఏరియాలో రాకపోకలపై నిషేధం
  • చెంచులపై తరచూ దాడులతో ఘర్షణ వాతావరణం

నాగర్​కర్నూల్, వెలుగు: నల్లమల అడవినే నమ్ముకుని బతుకుతున్న చెంచులు, గిరిజనులు ఆగమైతున్నరు. అటవీ ఉత్పత్తులతో పాటు సీజన్లవారీగా దొరికే వాటిని సేకరించి పొట్టపోసుకునే గిరిపుత్రులకు బతుకుదెరువు దూరమవుతోంది. ఎక్కడికక్కడ చెక్​పోస్టులు పెట్టి ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డుకుంటుండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజుల క్రితం నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా, గుంపన్​పల్లి గ్రామాలకు చెందిన 18 మంది గిరిజనులు ఇప్పపువ్వు కోసం అడవిలోకి వెళ్లగా వారిపై ఫారెస్ట్​ఆఫీసర్లు దాడి చేయడం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలతో గిరిజనులు, ఫారెస్ట్​ఆఫీసర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. నల్లమల అడవి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల మధ్య 2.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. నల్లమల అడవిపై ఆధారపడి అచ్చంపేట నియోజకవర్గంలో  2,569 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా అడవిలో దొరికే  జిగురు, ఇప్ప పలుకు, ఇప్ప పువ్వు, కానుగ పలుకులు, తేనె, నరమామిడి చెక్క, గుడిపాలేర్లు, చీపురు పుల్లలు, కుంకుడుకాయలు, చింతపండు, విస్తరాకులు తదితరాలను సేకరించి పొట్టపోసుకుంటున్నారు. అమ్రాబాద్ మండలంలో ముఖ్యంగా శ్రీశైలం ప్రధాన రహదారి దగ్గర్లో ఉండే వటవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బయలు వంటి చెంచు పెంటలతో పాటు, జంగంరెడ్డిపల్లి, వెంకటేశ్వర్లబావి, పదర మండలంలోని కొన్ని గ్రామాల్లో చెంచులు ఉత్పత్తులు సేకరిస్తున్నారు. అయితే ఫారెస్ట్​ ఆఫీసర్ల తీరుతో వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్పత్తుల సేకరణతోపాటు తమ పెంటల్లో చావులు, శుభకార్యాలకు చుట్టాలు రాకుండా ఫారెస్ట్​ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని సార్లపల్లి సర్పంచ్​మల్లికార్జున్​ వాపోయారు. అడవిలో చెట్ల దగ్గర దేవతల పూజలకు సైతం అనుమతించడం లేదన్నారు. అడవిలోకి వెళ్లేటపుడు  విల్లు, అంబులు, కొడవలి, గొడ్డలి వంటివి తీసుకుపోనీయడం లేదని, ఈమధ్య కొత్తగా ఫోటోలు తీసుకుని పంపిస్తున్నారని చెప్పారు. రోగాల బారిన పడితే అంబులెన్స్​వచ్చే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని చెప్పారు.  
జంతువులకు ఇబ్బందంటూ..
గిరిపుత్రులు వందల ఏండ్లుగా అడవినే నమ్ముకున్నారు. అయితే అడవిలో పులుల సంఖ్య పెరిగిందని, శాకాహార జంతువుల ఉనికికి ఆటంకం కలుగుతుందన్న కారణాలతో వారిని అడవిలోకి వెళ్లనీయడం లేదు. నల్లమల కోర్​ఏరియాలోని చెంచుపెంటల బాటలో రాకపోకలపై నిషేధం విధిస్తున్నారు. ఫారెస్ట్ సిబ్బందే అటవీ ఉత్పత్తి తోటల పెంపకం  చేపట్టి ఉపాధి కల్పించాలని చెంచులు కోరుతున్నారు. 

అడ్డుకుంటున్నం.. దాడి చేయట్లే
కొంతకాలంగా అడవిలో తరచూ మంటలు అంటుకుంటుండడంతో నిఘా పెంచాం. రాత్రి వేళల్లో ఫారెస్ట్​లోకి వెళుతున్న వారిని వాచర్లు అడ్డుకున్న సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొం టోంది. ఎవరైన అడవిలోకి ప్రవేశిస్తే సిబ్బంది అడ్డుకుంటున్నారు తప్ప దాడులు చేయడం లేదు. – కిష్టాగౌడ్, డీఎఫ్ వో, నాగర్ ​కర్నూల్​జిల్లా 
వెళ్లకుంటే తిండి ఎలా సారూ..
ఫారెస్టోళ్లకన్నా ముందు నుంచి మేం అడవిలోనే బతుకుతున్నం. అడవిని, చెట్లను, జంతువులను కాపాడుకుంటూ వచ్చినం. ఇప్పుడు ఫారెస్టోళ్లు వచ్చి అడవి మాది.. లోపలికి పోవొద్దని మమ్ములను ఆపుతున్నరు. అడవిలో దొరికే దుంపలు, గడ్డలు, గింజలను సేకరించి అమ్ముకుంటే వచ్చిన దానితోనే మా పిల్లలు, మేము బతుకుతున్నం. మాకు వేరే పని ఏదీ రాదు. ఇప్పుడు అడ్డుకుంటే మాకు తిండి ఎలా.. మేం బతికేదెలా?   
– చిర్ర రాములు, చెంచు నేత, సార్లపల్లి, అమ్రాబాద్​ మండలం  

గతంలోనూ ఎన్నో ఘటనలు

రెండేళ్ల క్రితం మన్ననూర్​ నుంచి వట్వర్లపల్లికి వెళుతున్న చెంచు యువకుడిపై ఫారెస్ట్​ సిబ్బంది దాడి చేసి గాయపరిచారు. అమ్రాబాద్​ మండలం తుర్కపల్లి సమీపంలోని అడవిలో పురాతన లింగమయ్య స్వామి దేవాలయంలో పూజల కోసం వెళ్లిన చెంచులను ఫారెస్ట్​ఆఫీసర్లు అడ్డుకుని అనుమతులు లేవని, అడవిలోకి రావద్దని వెళ్లగొట్టారు. నెల క్రితం అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన చెంచులను భౌరాపూర్​ సమీపంలో అడ్డుకుని వారి వద్ద ఉన్న సామగ్రిని లాక్కుని భయపెట్టి వెళ్లగొట్టారు. ఆదివాసీల బాగోగులు చూసే ఆఫీసర్లను సైతం ఫారెస్ట్​సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇటీవల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్, ఇతర చెంచు పెంటలకు వెళుతున్న అచ్చంపేట ఆర్డీవోను ఫారెస్ట్​ సిబ్బంది అడ్డుకున్నారు. తర్వాత కొంతసేపటికి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆర్డీవోను ఫారెస్ట్​లోకి పంపించారు.నెల క్రితం మన్ననూర్​కి చెందిన వ్యక్తి మేకలకు మేత కోసం అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కన కొమ్మలు కొట్టుకుని వస్తుండగా ఓ ఫారెస్ట్​ అధికారి అతనిపై దాడి చేసి గాయపరిచాడు.