తొందరెక్కువ : వేదికపైనే పెళ్లి కూతురికి ముద్దు.. పెళ్లికొడుకును చితక్కొట్టిన బంధువులు

తొందరెక్కువ : వేదికపైనే పెళ్లి కూతురికి ముద్దు.. పెళ్లికొడుకును చితక్కొట్టిన బంధువులు

సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి. వధూవరులు, బంధువులు, స్నేహితులు చేసే సందడి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రేమ, శృంగారం, వర్ణన కోసం కొందరు దృష్టిని ఆకర్షించగా, వేడుకలో జరిగిన విచిత్రమైన సంఘటనలు మరికొందరిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా  పెళ్లి వేడుక జరుగుతుండగా..పెళ్లికొడుకు చేసిన పనికి వివాహ వేడుక కాస్తా రణరంగంగా మారిపోయింది. 

పెళ్ళి కొడుకు చేసిన చిలిపి పనికి ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకునే దాకా వెళ్ళింది. దీంతో ఇరువురి బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటు చేసుకుంది

పెళ్లి వేడుకల (Wedding celebrations)లో వధూవరులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. నిశ్చితార్థం, హల్దీ, సంగీత్, మెట్టెలు తొడగడం వంటి ఆచారాల సమయంలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఈ సెలబ్రేషన్స్‌లో చిలిపి పనులు చేస్తూ పెళ్లి రోజును ఎప్పటికీ గుర్తుండి పోయే తీపి జ్ఞాపకంగా మలుచుకోవాలని చాలామంది భావిస్తారు. కొందరైతే అత్యుత్సాహంతో ఎవరూ ఊహించని కొంటె చేష్టలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా పెళ్లి వేడుకలో వరుడు వధువును వేదికపైన, అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టుకున్నాడు. దీంతో వధువు తరపు బంధువులు.. వరుడి బంధువులపై కర్రలతో దాడి చేశారు. 

 ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో పెళ్లి వేడుకలో వధువు తరఫు వారు ...వరుడిని కొట్టడమే కాకుండా... పెళ్లికి వచ్చిన అతిథులను కూడా కొట్టారు. దీంతో వరుడి తరపు వారు అటువైపు ఉన్న వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన కల్యాణోత్సవంలో తొక్కిసలాటను సృష్టించింది. అర డజను మందికి పైగా గాయపడ్డారు. విషయం పోలీసుల వరకు చేరింది. హాపూర్ దేహత్ ప్రాంతంలోని మొహల్లా అశోక్‌నగర్‌లో వివాహ వేడుక జరుగుతుండగా, జయమాల సమయంలో, వరుడు అందరి ముందు వేదికపై వధువును ముద్దాడాడు. వరుడి చేసిన ఈ పనికి వధువు తరపు వారికి ఆగ్రహం తెప్పించింది. పెళ్లికొడుకుతో సహా పెళ్లికి వచ్చిన అతిథుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

కొద్దిసేపటికే ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణ మొదలైంది. దీంతో కోపోద్రిక్తులైన వరుడి తరపు బంధువులు వధువుపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్‌లు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వధువు తండ్రితో సహా  ఆరుగురు గాయపడ్డారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. చివరికి పోలీసుల జోక్యంతో వివాహ తంతు ముగిసింది.

 ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని హాపూర్ సీనియర్ పోలీసు అధికారి రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ప్రజా శాంతికి విఘాతం కలిగించినందుకు ఐపీసీ  సెక్షన్ 151 కింద ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.