గుడిసెలో వెలసి..కోటి కాంతుల గుడిలో కొలువై.. ఏండ్ల చరిత్రకు నిదర్శనం నాగోబా ఆలయం

గుడిసెలో వెలసి..కోటి కాంతుల గుడిలో కొలువై.. ఏండ్ల చరిత్రకు నిదర్శనం నాగోబా ఆలయం

ఆదిలాబాద్, వెలుగు: దశబ్దాల క్రితం అటవీ ప్రాంతంలో చిన్న గుడిసెలో కొలువైన ఆదిశేషుడు.. నేడు కోటి కాంతుల కోవెలలో కొలువుదీరాడు. కాలం మారుతున్నా కొద్దీ ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర దినాదినాభివృద్ధి చెందింది. మెస్రం వంశీయుల ఆచార సాంప్రదయాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణాల్లో మార్పులు చేపట్టి నేడు గొప్ప కళాఖండంగా ఆలయం అలరారుతోంది. నాగోబా జాతర ప్రారంభం కాగా.. రోజూ వేలల్లో భక్తులు తరలివస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న నాగోబా ఆలయానిది దశబ్దాల చరిత్ర. 1942కు ముందు మెస్రం వంశీయులు అడవిలోని పుట్టను కొలిచే వారు.

ఆ తర్వాత చిన్న పందిరి గుడిసె వేసి సంప్రదాయ పూజలు చేశారు. 1960 నుంచి ఆలయం నిర్మాణం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆలయ పీఠాధిపతి మెస్రం దేవరావు పటేల్ 1960లో ఒకసారి, 1977లో మరోసారి ఆలయాన్ని నిర్మించారు. 1996లో పున:నిర్మాణం చేశారు. ప్రతిసారి మెస్రం వంశీయులే చందాలు వేసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. 2022లో మరోసారి పెద్ద ఎత్తున చందాలు చేసి రూ.5 కోట్లతో నాగోబా ఆలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించారు.