- ఒక్కరోజే దాదాపు రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
- మంగళవారం ఇదీ మార్కెట్ పరిస్థితి
- 1,065 సెన్సెక్స్ 353నిఫ్టీ
- భారీగా పడ్డ ఇండెక్స్‌లు.. 2 నెలల కనిష్టానికి చేరువ
- సెన్సెక్స్ 1,065, నిఫ్టీ 353 పాయింట్లు డౌన్
- లార్జ్, స్మాల్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు.. అన్ని రంగాల షేర్లు పతనం
- రియల్టీ -5%, ఆటో 2.56%, ఐటీ -2.06%, మెటల్ సెక్టార్ -2.2% డౌన్
హైదరాబాద్, వెలుగు: మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. జియో పొలిటికల్ టెన్షన్స్, టారిఫ్ వార్ భయాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలతో భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద మంగళవారం ఒక్కరోజే దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. గత రెండు రోజుల్లో రూ.12 లక్షల కోట్లు తగ్గింది. మార్కెట్‌లో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లన్నీ పడ్డాయి. అన్ని రంగాలూ నష్టపోగా.. ఐటీ, బ్యాంకింగ్, రియాల్టీ సెక్టార్లు ఎక్కువగా నష్టాలను నమోదు చేశాయి. దీంతో మన మార్కెట్ ఇండెక్స్‌లు అయిన సెన్సెక్స్, నిఫ్టీ రెండు నెలల కనిష్టానికి చేరాయి. సెన్సెక్స్ 1,065 పాయింట్లు నష్టపోయి 82,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 353 పాయింట్లు తగ్గి 25,232 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా, నిఫ్టీ దాదాపు 400 పాయింట్లు పడిపోయాయి.
అన్ని రంగాలు నష్టాల్లోనే..
అటు బీఎస్‌ఈ, ఇటు ఎన్‌ఎస్‌ఈలో చాలా కంపెనీల షేర్లు పడ్డాయి. బీఎస్ఈలో 3,503 స్టాక్స్నష్టపోగా, 780 స్టాక్స్ మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్ఈలో 2,200 స్టాక్స్ నష్టపోగా, 500 స్టాక్స్ మాత్రమే లాభాల్లో ముగిశాయి. మార్కెట్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలనే చవిచూశాయి. రియాల్టీ, ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా, బ్యాంకింగ్ సెక్టార్ ఇండెక్స్‌లు భారీగానే పడ్డాయి. నిఫ్టీలో రియల్టీ -5%, ఆటో -2.56%, ఐటీ -2.06%, మెటల్ -2.2%, ఫార్మా -1.8%, బ్యాంకింగ్ -1.1% చొప్పున నష్టపోయాయి. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత లేకపోవడం, కంపెనీల రిజల్ట్స్ అంచనాలకు తగ్గట్టు ఉండవనే వార్తలు ఐటీ షేర్లను దెబ్బతీశాయి. విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా లాంటి పెద్ద కంపెనీల షేర్లు దాదాపు 2 నుంచి 8 శాతం దాకా పడ్డాయి.న్యూజెన్ సాఫ్ట్‌వేర్ మాత్రం ఏకంగా 14 శాతం పడింది.
ఇవీ కారణాలు..
జియో పొలిటికల్ టెన్షన్స్, టారిఫ్ వార్ భయాలే మార్కెట్ పడడానికి ప్రధాన కారణమని అనలిస్టులు చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం, దాన్ని యూరోపియన్ యూనియన్ (ఈయూ) వ్యతిరేకించడం, ప్రతిగా ఈయూ దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్ హెచ్చరికలు చేయడం.. ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టింది. ఆ ప్రభావం మన మార్కెట్లపైనా భారీగానే పడింది. దీనికి తోడు ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్లు సోమవారం దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మగా, మంగళవారం కూడా రూ.2,938 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇది కూడా మార్కెట్ పడేందుకు కారణమైంది. ఇక రూపాయి మరింత బలహీనపడటం.. ఆసియా, యూరప్మార్కెట్లు నష్టాల్లో ఉండడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. వచ్చే బడ్జెట్ లో కొత్తగా ఎలాంటి పన్నులు విధిస్తారోననే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. రానున్న రోజుల్లో బడ్జెట్ ప్రకటనలు, అంతర్జాతీయ వార్తల ఆధారంగానే మార్కెట్ కదలికలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?
మార్కెట్ ఒడిదొడుకులకు గురైనప్పుడు ఇన్వెస్టర్లు భయాందోళనతో నిర్ణయాలు తీసుకోవద్దని అనలిస్టులు సూచిస్తున్నారు. మార్కెట్లలో పతనాన్ని చూసి హడావిడిగా షేర్లను అమ్మడం వల్ల భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘‘ఇలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను జాగ్రత్తగా పరిశీలించాలి. ఫండమెంటల్గాబలంగా ఉన్న కంపెనీల షేర్లను అలాగే ఉంచుకోవడం మంచిది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లోని పెద్ద కంపెనీల షేర్లు పడిపోయినా, అవి మళ్లీ కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది” అని చెబుతున్నారు. ‘‘ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్లు ఆచితూచి వ్యవహరించాలి. మార్కెట్ సాధారణ స్థితికి వచ్చే వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అలాగే బడ్జెట్‌పై స్పష్టత వచ్చే వరకు వేచిచూడటం మేలు. ఎఫ్‌ఐఐలు భారీగా షేర్లను విక్రయిస్తున్నప్పుడు సాధారణ ఇన్వెస్టర్లు తొందరపడి షేర్లను కొనకూడదు. వాళ్లు ఈ నెల ఏకంగా రూ.30 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారంటే మార్కెట్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీలైతే ఈ పతనాన్ని ఒక అవకాశంగానూ మార్చుకోవాలి. మంచి లాభాలు ఇచ్చే నాణ్యమైన షేర్లు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిలో ఒకేసారి మొత్తం డబ్బును పెట్టకుండా, దశల వారీగా పెట్టుబడులు పెట్టడం మంచిది. విభిన్న రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు” అని అనలిస్టులు సూచిస్తున్నారు.
20 రోజుల్లో 32 వేల కోట్లు..
ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. గత 10 ట్రేడింగ్సెషన్లలో ఎఫ్‌ఐఐలు దాదాపు రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 20 వరకు రూ.32,253.55 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
ఎక్కువగా పడ్డ షేర్లు
1. న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ –- 14.52%
2. డేటా ప్యాటర్న్స్ ఇండియా – 9.47%
3. ఓలా -– 8.87 %
4. శోభా రియాల్టీ -– 8.61 %
5. మనోరమ ఇండస్ట్రీస్ – - 8.35%
6. యూపీఎల్ -– 8.09%
7. ల్యూమాక్స్ ఆటో టెక్నాలజీస్ –- 7.92%
8. ఒబెరాయ్ రియాల్టీ -– 7.92%
9. జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్ – -7.73%
10. కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ -– 7.49%
కారణాలివే..
1. జియో పొలిటికల్ టెన్షన్స్,
గ్లోబల్ మార్కెట్లలో వీక్‌నెస్
2. యూరప్ దేశాలపై అమెరికా టారిఫ్‌లు
3. ఎఫ్ఐఐల అమ్మకాలు
4. రూపాయి విలువ క్షీణించడం
5. బంగారం, వెండికి డిమాండ్ పెరగడం
గోల్డ్, సిల్వర్ పైపైకి
బంగారం, వెండి సరికొత్త రికార్డులను సృష్టించాయి. మంగళవారం మరో రూ.20,400 పెరగడంతో ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3.23 లక్షలకు చేరింది. సిల్వర్ రేటు గత 20 రోజుల్లోనే రూ.85 వేలు పెరిగింది. ఇక 10 గ్రాముల బంగారం ధర రూ.5,100 పెరిగి రూ.1,53,200కు చేరింది.10 గ్రా. బంగారం 1,53,200 కిలో వెండి 3,23,000
