- బీసీ గురుకుల ఇంటర్ లో 8 ఒకేషనల్ కోర్సులు
- పదో తరగతి స్టూడెంట్లకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
- టూరిజం, హోటల్ మేనేజ్ మెంట్, వీఎఫ్ఎక్స్ వంటి కోర్సుల్లో
- చేరేలా ప్రోత్సాహం
హైదరాబాద్, వెలుగు: బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలోని సృజనాత్మకతను వెలికితీసే కోర్సులను, ఉపాధి అవకాశాలు కల్పించే వృత్తివిద్యా కోర్సులను బీసీ గురుకులాల్లో అందిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరేందుకు మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాలేజీ నుంచి సరాసరి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరేలా కోర్సులను రూపొందించారు. బీసీ గురుకులాల్లో పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్.. ఇంటర్ లో ఒకేషనల్ కోర్సుల్లో చేరేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు టూరిజం, హోటల్ మేనేజ్ మెంట్, వీఎఫ్ఎక్స్, యానిమేషన్ కోర్సులను బీసీ గురుకుల ఇంటర్ కాలేజీల్లో బోధిస్తున్నారు. బీసీ గురుకుల కాలేజీలో మొత్తం 13 గ్రూపులు ఉండగా రెగ్యులర్ కోర్సులు 8 ఉన్నాయి. మిగతావి ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి.
19వేల మంది స్టూడెంట్లు
బీసీ గురుకుల స్కూళ్లలో ప్రస్తుతం 19 వేల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు ఇంటర్ లో రెగ్యులర్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి 24,720 సీట్లు ఉన్నాయి. గత ఏడాది వరకు ఇంటర్ లో అడ్మిషన్ల భర్తీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించి సీట్లు భర్తీ చేశారు. నిరుటి నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇందుకు పదో తరగతి చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ కే ఇంటర్ సీటు కోసం వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ లో 14,721, సెకండియర్ లో 12,091 సీట్లు ఉన్నాయి. వీటిలో 70 శాతం మంది రెగ్యులర్ కోర్సుల్లోనే జాయిన్ అయ్యారు. పదో తరగతి స్టూడెంట్లలో ఇంటర్ లో ఏ కోర్సు తీసుకుంటారో, ఏ కోర్సుకు ఆసక్తి ఉందో స్టూడెంట్ల నుంచి ప్రిన్సిపల్స్ వివరాలు సేకరిస్తున్నారు. రెగ్యులర్ కోర్సులు కాకుండా ఒకేషనల్ కోర్సులు చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బీసీ గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ఇవే..
ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్, అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను బోదిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఈ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది. అలాగే ఈ కోర్సులను బోధించే నిపుణులు తక్కువ సంఖ్యలో ఉన్నారని అధికారులు తెలిపారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగం ఇటీవల మన దేశంలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. యానిమేషన్, విజువల్ మీడియా, ప్రోడక్ట్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ కోర్సులకు ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో అత్యధిక డిమాండ్ ఉన్న ఈ కోర్సులను బీసీ జూనియర్ గురుకుల కాలేజీల్లో అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులంతా ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
