- అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేతల వలసలే కారణం
- కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఎంపిక
- చేయాలని నిర్ణయం అసంతృప్తులే దిక్కు
- పోటీకి వెనుకాడతున్న బీఆర్‌ఎస్ క్యాడర్
యాదాద్రి, వెలుగు: పదేండ్లు పవర్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌కు మున్సిపల్ఎన్నికల్లో అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్తరపున పోటీ చేయడానికి ఆశావహులు పోటెత్తుతుంటే.. బీఆర్‌ఎస్ తరపున పోటీ చేయడానికి కొన్ని వార్డుల్లో ఆ పార్టీ లీడర్లు వెనకంజ వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక తర్వాతే తమ అభ్యర్థులను ఎంపిక చేయాలని ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ కూడా వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది.
పంచాయతీ ఎన్నికల రిజల్ట్ తో...
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. గెలుస్తామనుకున్న స్థాయిలో పంచాయతీలు గెలుపొందలేదు. దీంతో ఆ పార్టీ లీడర్లు, కేడర్ నిరాశకు లోనయ్యారు. ఈ తరుణంలో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తుండడంతో ఇప్పుడైనా ఎక్కువ వార్డులతో పాటు చైర్మన్ సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే పవర్‌లో ఉన్నప్పుడే 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆలేరు, భూదాన్ పోచంపల్లి మాత్రమే గెలిచింది. మోత్కూరు మన్సిపాలిటీని డ్రా పద్ధతిలో గెలుచుకుంది. మెజారిటీ కౌన్సిలర్లు గెలవకపోవడంతో చౌటుప్పల్, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్అఫిషియో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో వారు ఓట్లు వేసినా ఫలితం దక్కే అవకాశం లేకపోవడంతో భువనగిరిలో ఓ బీజేపీ కౌన్సిలర్, చౌటుప్పల్లో సీపీఎం కౌన్సిలర్ల సహకారం తీసుకొని చైర్మన్సీట్లను బీఆర్‌ఎస్ చేజిక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చౌటుప్పల్, యాదగిరిగుట్ట చైర్మన్లుకాంగ్రెస్లో చేరారు. మోత్కూరులో అవిశ్వాసం కారణంగా బీఆర్‌ఎస్ చైర్మన్ పదవి కోల్పోగా, కాంగ్రెస్ కౌన్సిలర్ చైర్మన్గా ఎన్నికయ్యారు.
పోటీ చేయడానికి వెనుకడుగు.!
2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ క్యాడర్ కొంత బలహీనంగా ఉంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి విపరీతమైన పోటీ నెలకొంటే.. బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయడానికి అంతగా ఉత్సాహం చూపడం లేదు. పవర్‌లో ఉన్న సమయంలోనే మున్సిపాలిటీల్లో మెజారిటీ రాకపోవడంతో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎక్స్ అఫిషియో ఓట్ల సహకారంతో చైర్మన్లు దక్కించుకున్న సంగతిని గుర్తు చేసుకుంటున్నారు.
దీంతో పోటీ చేయడానికి వెనుకాడుతున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో ‘వెయిట్ అండ్ సీ’ అన్న ధోరణిని అవలంభించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాతే.. ఆ పరిణామాలను గమనించి ఎంపిక చేయాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్లో పోటీ ఎక్కువగా ఉన్నందున ఆపార్టీలో టికెట్దక్కనివారు బీఆర్‌ఎస్ వైపు వచ్చే అవకాశం కొట్టిపారేయలేమని అనుకుంటున్నారు.
అదే విధంగా కాంగ్రెస్ఎంపిక చేసిన అభ్యర్థి కులం ఆధారంగా చేసుకొని అదే కులానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. తద్వారా మున్సిపాలిటీల్లో చైర్మన్ సీట్లను కైవసం చేసుకొని బీఆర్‌ఎస్ క్యాడర్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్నారు.
