న్యూఢిల్లీ: జంతు ప్రేమికురాలు, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును విమర్శించడంపై మండిపడింది. సుప్రీం కోర్టు తీర్పును ఉద్దేశిస్తూ ఓ పాడ్ కాస్ట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె బాడీ లాంగ్వేజ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ అత్యున్నత ధర్మాసనంపై ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని.. మేనకా గాంధీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని న్యాయస్థానం పేర్కొంది.
మంగళవారం (జనవరి 20) వీధి కుక్కల కేసుపై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్, ఎన్.వి. అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. మేనకా గాంధీ తరపున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ హాజరై వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇటీవల మీరు కోర్టులు ఉదాసీనంగా వ్యవహరించాలని అన్నారు. మరీ మీ క్లయింట్ (మేనకా గాంధీ) ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో గమనించారా..? మీరు ఆమె పాడ్‌కాస్ట్ విన్నారా..? ఆమె బాడీ లాంగ్వేజ్ చూశారా..? ఆమె న్యాయస్థానానికి వ్యతిరేకంగా అన్ని రకాల వ్యాఖ్యలు చేసింది’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : "కూతురు చనిపోయిన రోజు కూడా నేను పనిచేశాను"..
వీధికుక్కలకు సంబంధించిన కోర్టు ఆదేశాలను ఆమె విమర్శించడం కోర్టు ధిక్కారమేనని మండిపడింది. అయినప్పటికీ ఆమెపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడం లేదని.. అది మా మంచితనమని ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా.. జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ గతంలో స్త్రీ, శిశు అభివృద్ధి, సామాజిక న్యాయం, జంతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రిగా పని చేశారని.. అప్పుడు వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఎంత బడ్జెట్ కేటాయించారని ప్రశ్నించింది.
ఈ కామెంట్‌పై న్యాయవాది రామచంద్రన్ స్పందిస్తూ.. బడ్జెట్ కేటాయింపులు విధానపరమైన విషయమని వాదించారు. అది తన క్లయింట్ ఒక్కరి చేతిలో ఉండదన్నారు. అంతేకాకుండా ముంబైలో 26/11 ఉగ్రవాద దాడిలో సజీవంగా పట్టుబడిన పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ తరపున తాను వాదించానని ఆయన పేర్కొన్నారు. రామచంద్రన్ వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్రంగా స్పందింది. అజ్మల్ కసబ్ కోర్టు ధిక్కారానికి పాల్పడలేదని.. కానీ మీ క్లయింట్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని చురకలంటించింది. అనంతరం కేసు తదుపరి విచారణను 2026, జనవరి 28వ తేదీకి వాయిదా వేసింది.
ఇంతకీ మేనకా గాంధీ ఏమన్నారంటే..?
ఎనిమిది వారాల్లోగా వీధి కుక్కలను పట్టుకుని ప్రత్యేక ఆశ్రయాలకు తరలించాలని ఢిల్లీలోని పౌర అధికారులను 2025లో జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రేకెత్తాయి. దీంతో ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు.
ఈ క్రమంలో ఓ పాడ్ కాస్ట్లో పాల్గొన్న మేనకా గాంధీ వీధికుక్కలపై సుప్రీం కోర్టు తీర్పుపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇది చాలా విచిత్రమైన తీర్పు అని.. ఇది ఆచరణీయం కాదని అన్నారు. కుక్కలపై కోపం ఉన్న వ్యక్తి ఇచ్చినట్లుగా తీర్పు ఉందని కామెంట్ చేశారు. వీధి కుక్కలకు సంబంధించి ఆదేశాలు జారీ చేసే ముందు మన ప్రభుత్వ సంస్థల వాస్తవ స్థితిని సుప్రీం కోర్టు ఒకసారి పరిశీలించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేనకా గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపైనే తాజాగా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
