"కూతురు చనిపోయిన రోజు కూడా నేను పనిచేశాను".. రోజుకు రూ.66 జీతం.. మధ్యాహ్న భోజన వంటవాళ్ల ఆవేదన..

 "కూతురు చనిపోయిన రోజు కూడా నేను పనిచేశాను".. రోజుకు రూ.66 జీతం.. మధ్యాహ్న భోజన వంటవాళ్ల  ఆవేదన..

ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండే వేల మంది వంట మనుషులు గత 21 రోజులుగా రాయ్‌పూర్‌లో నిరసన చేస్తున్నారు. తమకు ఇచ్చే ప్రతిరోజు కూలి రూ.66 నుండి రూ.340కి పెంచాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ​ఈ నిరసనలో పాల్గొంటున్న వారి బాధలు వింటే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.

మేఘరాజ్ బాఘేల్ అనే నిరసనకారుడు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా నేను వంట మనిషిగా పనిచేస్తున్నాను. నేను మొదలుపెట్టినప్పుడు రోజుకు రూ.15 వచ్చేవి, ఇప్పుడు రూ.66 ఇస్తున్నారు. ఈ తక్కువ జీతంతో ఇల్లు గడవడం లేదు. పిల్లల చదువుల కోసం రూ.90వేల అప్పు చేశాను. మా నాన్న చనిపోయిన రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేశాను" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సుకృతా చవాన్ అనే మరో నిరసనకారుడు మాట్లాడుతూ 2024లో నా కూతురు చనిపోయిన రోజు కూడా నేను వంట చేశాను. ప్రభుత్వం మా మాట పట్టించుకోవడం లేదు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బియ్యం కడగడం, వండడం, వడ్డించడం, గిన్నెలు తోమడం.. ఇలా అన్ని పనులు మేమే చేస్తున్నాం. కానీ మాకు ఇచ్చే జీతం మాత్రం చాలా తక్కువ" అని ఆమె చెప్పారు.

​నిరసన చేస్తున్న ఇతర వంట మనుషులు కూడా వారి కష్టాలను చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో కూడా మాతో బలవంతంగా వంట చేయిస్తారు, కానీ పైసా జీతం కూడా ఎక్కువ ఇవ్వరు అని పంకజ్ అనే వ్యక్తి వాపోయారు. ధరలు పెరిగిపోవడంతో కనీసం టమాటాలు కొనాలన్నా భయమేస్తోందని వారు అంటున్నారు. శకుంతల అనే మహిళ మాట్లాడుతూ మా ఇద్దరు పిల్లలను కాలేజీ కూడా మాన్పించేశాను... ఎందుకంటే చదివించడానికి డబ్బులు లేక వారు చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అంగన్‌వాడీ టీచర్లకు ఉన్నంత గౌరవం కూడా సమాజంలో మాకు  లేదని షిప్రా అనే మహిళ ఈ విధంగా చెప్పుకుంటూ బాధపడ్డారు.

ప్రభుత్వం ఏమంటోందంటే ?
​ఈ నిరసనపై ప్రభుత్వ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ప్రస్తుతం ఇస్తున్న దానికంటే నెలకు ఒక రూ.1,000 పెంచి, మొత్తం జీతాన్ని రూ.3,000 చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. మాకు కనీస వేతనం ఇచ్చే వరకు మా పోరాటం ఆపబోమని వంట మనుషులు చెబుతున్నారు.