స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థ ఒక చారిత్రాత్మక మైలురాయికి చేరువలో ఉందని తేలింది. 2030 నాటికి భారత్ 'అప్పర్ మిడిల్ ఇన్కమ్' దేశాల జాబితాలో చేరనుందని రిపోర్ట్ వెల్లడించింది. ప్రస్తుతం చైనా, ఇండోనేషియా వంటి దేశాలు ఉన్న ఈ కేటగిరీలోకి భారత్ ప్రవేశించడం దేశ ఆర్థిక ప్రగతిలో ఒక కీలక మలుపుగా మారనుంది.
ప్రపంచ బ్యాంక్ నిబంధనల ప్రకారం దేశాలను తలసరి స్థూల జాతీయ ఆదాయం(GNI) ఆధారంగా నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తారు. 1990లో చైనా తలసరి ఆదాయం కేవలం 330 డాలర్లుగా ఉండి 'లో ఇన్కమ్' దేశంగా ఉండేది. కానీ 2024 నాటికి అది అప్పర్ మిడిల్ ఇన్కమ్ స్థాయికి చేరుకుంది. భారత్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 1962లో కేవలం 90 డాలర్లుగా ఉన్న భారత్ తలసరి ఆదాయం.. 2007 నాటికి 910 డాలర్లకు చేరుకుని 'లోయర్ మిడిల్ ఇన్కమ్' దేశంగా మారింది.
మైలురాళ్లను అధిగమిస్తూ..
భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి 1 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడానికి భారత్‌కు 60 ఏళ్లు పట్టింది. కానీ ఆ తర్వాత కేవలం ఏడేళ్లలోనే 2014 నాటికి 2 ట్రిలియన్లకు, 2021 నాటికి 3 ట్రిలియన్లకు, 2025 నాటికి 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటి ముందుగా సాగుతోంది వేగంగా. రాబోయే రెండేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాకుండా.. 2028 నాటికి జర్మనీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది.
2030 నాటికి 4వేల డాలర్ల లక్ష్యం..
2026 నాటికి భారత తలసరి ఆదాయం 3వేల డాలర్లకు, 2030 నాటికి 4వేల డాలర్లకు చేరుకుంటుందని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశంగా గుర్తింపు పొందడానికి కావాల్సిన 4వేల 500 డాలర్ల స్థాయిని చేరుకోవడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదని నివేదిక పేర్కొంది. ఇందుకోసం నామినల్ జీడీపీ డాలర్ల పరంగా 11.5 శాతం వృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లుగా భారత్ చూపుతున్న వృద్ధి రేటును గమనిస్తే ఇది సాధ్యమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
వికసిత భారత్ - 2047 లక్ష్యం..
భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న 'వికసిత భారత్ 2047' విజన్ ప్రకారం.. ఇండియా హై ఇన్కమ్ దేశంగా మారాలంటే తలసరి ఆదాయం 13వేల 936 డాలర్లకు చేరాలి. దీనికోసం భారత్ రాబోయే 23 ఏళ్లలో 7.5 శాతం వార్షిక వృద్ధి రేటును కొనసాగించాల్సి ఉంటుంది. గత 23 ఏళ్లలో భారత్ ఇప్పటికే 8.3 శాతం వృద్ధిని సాధించిన నేపథ్యంలో.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ చేరడం ఖాయమని ఎస్‌బీఐ లేటెస్ట్ రిపోర్ట్ అంచనా వేసింది. మెుత్తానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రజల ఆదాయాలు పెరగుదల కూడా అంతే ముఖ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.
