- హైటెక్ సిటీలో హస్తకళల ప్రదర్శన ప్రారంభంలో అక్కినేని అమల
- రేపు బజార్‌ను సందర్శించనున్న మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: హస్తకళలను ప్రోత్సహించడం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని సినీనటి, సామాజిక కార్యకర్త అక్కినేని అమల పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో ఇండియా హ్యాండ్‌మేడ్ కలెక్టివ్(ఐహెచ్ఎంసీ), సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళల ప్రత్యేక ప్రదర్శనను ఆమె శుక్రవారం ప్రారంభించారు.
సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, టెక్స్‌టైల్ నిపుణులు విజయలక్ష్మి నార్నే, వ్యవసాయ శాస్త్రవేత్త జీవీ రామాంజనేయులుతో కలిసి ఆమె స్టాళ్లను సందర్శించారు. చేతివృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అమల గుర్తుచేశారు. మెషీన్ల ఆధిపత్యం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో తరతరాలుగా వస్తున్న కళలు మరుగున పడిపోకుండా చూడాలని కోరారు.
యువతకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని, విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పిస్తే కళాకారులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో హస్తకళాకారులు రూపొందించిన వైవిధ్యభరితమైన ఉత్పత్తులు కొలువుదీరాయి. చేతితో నేసిన వస్త్రాలు, సహజ వర్ణాల దుస్తులు, మట్టి ఆభరణాలు, కొండపల్లి బొమ్మలు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
సుమారు 2,500 మంది గ్రామీణ చేతివృత్తిదారుల ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం మంత్రి సీతక్క ఈ బజార్‌ను సందర్శించనున్నారు. కార్యక్రమంలో ఉదయ దైతి, సర్వాణి, జాహ్నవి, అలంకృత, సవిత తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
