మనం షాపింగ్ మాల్స్‌లో తిరుగుతున్నప్పుడు లేదంటే ఆన్‌లైన్ వెబ్‌సైట్లను చూస్తున్నప్పుడు ఏదో ఒక వస్తువు మనల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. అది అవసరమా కాదా అని ఆలోచించే లోపే 'బై నౌ' బటన్ నొక్కేస్తాం. ఇలాంటి హఠాత్తు నిర్ణయాల వల్ల నెల చివరలో జేబు ఖాళీ అవ్వడమే కాక.. కొన్న వస్తువును చూసి ఇది అనవసరంగా కొన్నానే అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారమే '30-డే రూల్'. ఇది అనవసరపు ఖర్చులకు ఎలా అడ్డుకట్ట వేసి మనల్ని ఆర్థికంగా కాపాడుతుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు ఏమిటి ఈ 30 డే రూల్..?
ఈ రూల్ చాలా ఈజీ. మీకు ఏదైనా వస్తువు కొనాలని అనిపించినప్పుడు.. వెంటనే ఆవేశపడి కొనకుండా సరిగ్గా 30 రోజులు ఆగండి. ఆ వస్తువు పేరు, దాని ధర, మీరు చూసిన తేదీని ఒక చోట రాసి పెట్టుకోండి. ఆ ఒక నెల రోజులు గడిచిన తర్వాత కూడా ఆ వస్తువు మీకు ఇంకా అవసరమే అనిపిస్తే.. అప్పుడు మాత్రమే దానిని కొనండి. చాలా సందర్భాల్లో ఆ వస్తువుపై ఉన్న వ్యామోహం నెల తిరిగేసరికి తగ్గిపోతుంది. దీనివల్ల మీ డబ్బు ఆదా అవుతుంది.
మన మెదడులోని ఎమోషన్స్ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంటాయి. 30 రోజుల గడువు ఇవ్వడం ద్వారా మన మెదడులోని ఆలోచనాత్మక భాగం చురుగ్గా మారి, ఆ వస్తువు నిజంగా అవసరమా లేక కేవలం క్షణికావేశమా అనేది విశ్లేషిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఇంపల్స్ బయింగ్ తగ్గుతుంది.
ఈ 30 రోజుల్లో మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు:
వస్తువును చూసిన వెంటనే పక్కన పెట్టి, ఈ నెల రోజుల్లో ఈ క్రింది విషయాలను విశ్లేషించుకోవాలి:
1. ఈ వస్తువు కొనడం వల్ల నెలవారీ ఖర్చులు లేదా సేవింగ్స్ దెబ్బతింటాయా? అని చెక్ చేసుకోండి.
2. ఈ వస్తువు వేరే చోట తక్కువ ధరకు దొరుకుతుందా? వచ్చే వారం ఏవైనా సేల్స్ లేదా డిస్కౌంట్లు ఉన్నాయా? అని చూసుకోండి.
3. ఇదే అవసరాన్ని తీర్చే తక్కువ ధర కలిగిన వస్తువులు ఏవైనా ఉన్నాయా? మార్కెట్లో అని కూడా చెక్ చేయండి.
4. ఈ వస్తువు ధరను మీ పని గంటలతో పోల్చుకోండి. ఉదాహరణకు.. మీరు గంటకు రూ. 200 సంపాదిస్తుంటే, ఒక రూ.2వేల విలువైన వస్తువు కోసం మీరు 10 గంటల కష్టాన్ని వెచ్చించాలా? అని ఆలోచించండి. అప్పటికీ అవసరమనిపిస్తే కొనాలని నిర్ణయించుకోండి.
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దానిని జాగ్రత్తగా ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ 30 రోజుల నియమం మిమ్మల్ని పిసినారిగా మార్చదు, కానీ మిమ్మల్ని ఒక బాధ్యతాయుతమైన కొనుగోలుదారుగా మారుస్తుంది. ఇంకో సారి ఏదైనా ఆకర్షణీయమైన వస్తువు కనిపిస్తే.. వెంటనే వాలెట్ తీయకండి.. ఒక నెల రోజులు ఆగి అప్పుడు డిసైడ్ అవ్వండి దానిని కొనాలా లేదా అన్నది.
