91 మార్కు దాటిన రూపాయి: విలువ పతనానికి కారణాలు ఇవే..

91 మార్కు దాటిన రూపాయి: విలువ పతనానికి కారణాలు ఇవే..

భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రమంగా బలహీనపడుతోంది. మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌ సెషన్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 91 మార్కును దాటి.. అత్యంత కీలకమైన 91.03 వద్దకు చేరుకుంది. 2025 డిసెంబర్‌లో నమోదైన చారిత్రాత్మక కనిష్ట స్థాయిలకు రూపాయి అత్యంత చేరువగా రావడం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు సెషన్లుగా రూపాయి విలువ నిరంతరం పడిపోతూ దాదాపు 1 శాతానికి పైగా నష్టపోవటం ఆందోళనలను మరింత పెంచేస్తోంది.

రూపాయి పతనానికి ప్రధానంగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల అమ్మకాల వెల్లువ ఒక కారణంగా ఉంది. భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. కేవలం జనవరి 19వ తేదీనే సుమారు రూ.3వేల 262 కోట్ల విలువైన షేర్లను వీరు విక్రయించారు. విదేశీయులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నప్పుడు డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ సహజంగానే తగ్గుతుంది. దీనికి తోడు అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read : లగ్జరీ ఫీచర్లతో అదిరిపోయిన కొత్త కుషాక్ SUV

మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల చట్టబద్ధతపై యూఎస్ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ప్రపంచ మార్కెట్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ టారిఫ్‌ల వల్ల ప్రపంచ వాణిజ్యానికి విఘాతం కలుగుతుందనే భయంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే ప్రస్తుతం మార్కెట్లు 'రిస్క్ ఆఫ్' మోడ్‌లో ఉన్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు పెట్టుబడిదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని రూపాయి మరింత పడిపోకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాలు రూపాయిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దిగుమతిదారులు ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ డాలర్లను కొనుగోలు చేస్తుండటం రూపాయిపై భారాన్ని మరింత పెంచుతోందని వెల్లడైంది.