- 21 మంది ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ గ్రూప్
- పురుషులతో సమానంగా డ్యూటీలు చేసేలా కమాండో ట్రైనింగ్
- కూంబింగ్, ఫైరింగ్, బాంబ్ డిస్పోజల్, బందోబస్త్ విధుల్లో శిక్షణ
వరంగల్, వెలుగు : వరంగల్ కేంద్రంగా ‘రుద్రమ’ మహిళా పోలీస్ కమాండోస్ టీం రెడీ అయింది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆలోచనతో రాష్ట్రంలోనే తొలిసారి వరంగల్ కమిషనరేట్‌లో ‘ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్’ను ఏర్పాటు చేశారు. యువ బ్యాచ్‍తో కూడిన ఫోర్స్కావడంతో ఫిజికల్ ఫిట్‍నెస్‍తో పాటు ఆపద సమయాల్లోనూ కచ్చితమైన టార్గెట్‌ను చేధించేలా శిక్షణ పూర్తి చేసుకున్నారు. మెన్ పోలీస్ ఫోర్స్‌తో సమానంగా ఎలాంటి ఎమర్జెన్సీ డ్యూటీలైనా చేపట్టేందుకు రుద్రమ టీం మెంబర్స్ సిద్ధమయ్యారు.
ఏఆర్ విభాగానికి చెందిన 21 మందితో...
పోలీస్ శాఖ తరఫున శాంతిభద్రతలు కాపాడే క్రమంలో ప్రత్యేక డ్యూటీలు చేసే ఆర్డ్మ్ రిజర్వ్‌ఫోర్స్ (ఏఆర్ పోలీస్)కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ధర్నాలు, రాస్తారోకోలు, అల్లర్లు, జాతరలు, ప్రముఖుల బందోబస్తుల్లో ఏఆర్ విభాగమే కీలకం. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పురుషులతో పాటు ఉమెన్ ఫోర్స్ కూడా కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇటీవలే ఏఆర్ విభాగంలో పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 40 మంది మహిళా కానిస్టేబుళ్లలో చురుగ్గా ఉండే 21 మందిని ఎంపిక చేసి ‘రుద్రమ’ పేరుతో స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ టీంలో రాష్ట్ర స్థాయిలో బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్ క్రీడల్లో రాణించిన యువతులతో పాటు ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత కోర్సులు చదివిన వారు సైతం ఉన్నారు.
కమాండో తరహా ట్రైనింగ్..
రుద్రమ టీంకు ఎంపికైన వారికి సుమారు నెలన్నరపాటు ఎన్‌ఎస్‌జీ, ఎస్‍పీజీ, గ్రేహౌండ్స్ తరహాలో ట్రైనింగ్ ఇప్పించారు. ఎమర్జెన్సీ సమయాల్లోనూ రాణించేలా పది కిలోమీటర్ల రన్నింగ్, పీఈటీ పరేడ్ మొదలుకొని రోప్ క్లైంబింగ్, ఫైరింగ్, ఏకే 47, ఎస్ఎల్ఆర్ వంటి వెపన్స్‌ను ఉపయోగించే విధానంపై ట్రైనింగ్ ఇచ్చారు. అడవుల్లో కూంబింగ్ చేయడం, రహస్య స్థావరాలపై క్షణాల్లో దాడులు చేసే మెళకువలు సైతం నేర్పించారు. అలాగే రాత్రి సమయాల్లోనూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో.. కండ్లకు గంతలు కట్టుకొని వెపన్స్ విడదీయడం, తిరిగి ఫిట్టింగ్ చేసేలా బ్లైండ్ ఫోల్డ్ శిక్షణ, పోరాట సమయాల్లో గాయపడ్డ తోటి సిబ్బందిని భుజాలపై లిఫ్ట్ చేయడం, అడవుల్లో గమ్యస్థానాలకు చేరేలా మ్యాప్ రీడింగ్, నావిగేట్ చేయడం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కరాటే ట్రైనింగ్‌తో పాటు మానసికంగానూ దృఢంగా ఉండేలా యోగ, ధ్యానంలో శిక్షణ అందించారు. వీటన్నింటితో పాటు డ్రైవింగ్, బాంబులను నిర్వీర్యం చేయడం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ కమాండో తరహా ట్రైనింగ్ ఇచ్చారు.
కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగినయ్
పోలీస్ కానిస్టేబుల్ కావాలన్న లక్ష్యంతో ఏఆర్ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. రెగ్యులర్ ట్రైనింగ్ మమ్మల్ని దృఢంగా తీర్చిదిద్దగా.. రుద్రమ ఉమెన్స్ స్పెషల్ ఫోర్స్‌లో ఇట్టిన ట్రైనింగ్‌తో కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగింది. కూంబింగ్, అల్లర్లు, బందోబస్త్ విధులను సైతం ఈజీగా చేయగలమన్న ఆత్మవిశ్వాసం రెట్టింపైంది.
- మౌనిక, రుద్రమ స్పెషల్ ఫోర్స్
మా శక్తిని మేమే నమ్మలేకపోతున్నం
మహిళగా పోలీస్ వృత్తిలోకి రావాలంటే మొదట్లో కొంత ఆలోచించా. కానీ, యూనిఫాం అంటే ఇష్టంతో ఏఆర్ కానిస్టేబుల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న. ఆపై రుద్రమ స్పెషల్ ఫోర్స్‌లో చేరే క్రమంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ వంటి గన్ పట్టుకోవాలంటే భయపడ్డా. కానీ ఆఫీసర్లు ఇచ్చిన స్పెషల్ ట్రైనింగ్ పూర్తయ్యాక మా శక్తిని మేమే నమ్మలేకపోయాం. పురుషులతో సమానంగా ఫైరింగ్, క్లైంబింగ్, రన్నింగ్ చేయగలం. ఎలాంటి వెపన్ ఇచ్చినా ఈజీగా ఆపరేట్ చేయగలం.
- చైతన్య, రుద్రమ స్పెషల్ ఫోర్స్
