దేవుడి మీద ఒట్టు పెడితే రైతుకు న్యాయం జరగదు:కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

దేవుడి మీద ఒట్టు పెడితే రైతుకు న్యాయం జరగదు:కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

 

  • సీఎంకు రైతులకంటే ఎన్నికలే ముఖ్యమా

  • ప్రతి గింజ కొనడానికి  కేంద్రం సిద్ధం

  •  రుణమాఫీ లేదు..బోనస్ లేదు

  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి​: దేవుడి మీదు ఒట్టు పెడితే రైతులకు న్యాయం జరగదని పరోక్షంగా సీఎం రేవంత్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురం, రుద్రవెళ్లి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  కిషన్ రెడ్డి పరిశీలించారు. వడ్ల కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ఆలస్యం అవుతుందని కిషన్ రెడ్డి దగ్గర రైతులు మొర పెట్టుకున్నారు. దీంతో నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ  మోదీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉందన్నారు.

 సీఎంకు రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నారని,  రేవంత్ రెడ్డి దొడ్డు వడ్లు వేస్తే బోనస్ ఇవ్వబోమని అంటున్నారని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు. రుణమాఫీ లేదని, బోనస్ ఇవ్వడం లేదన్నారు. ధాన్యం కొనడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సన్న రకం పేరు మీద దొడ్డు వడ్ల రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ సహించదని హెచ్చరించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులకు  బ్యాంకర్లురుణాలు ఇవ్వడం లేదన్నారు. 45 రోజులుగా  కేంద్రానికి ధాన్యం వస్తున్నా కొనడం   లేదన్నారు. కొనుగోలు ప్రక్రియలో ప్రతి దశకు కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని,అయినా కొనుగోలు సరిగ్గా జరగడం లేదన్నారు. తెలంగాణలో అటవిక రాజ్యం నడుస్తోందని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి సూట్ కేస్ లు మోస్తున్నారే తప్ప ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.  సన్నరకం వడ్లకు రూ .1000, దొడ్డు రకం వడ్లకు రూ. 500  బోనస్​ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.