నల్గొండ అర్బన్, వెలుగు: ఈ నెల 28న వరంగల్‌లో నిర్వహించనున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం నల్గొండలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన జిల్లా మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు పర్మినెంట్ హోదాకు నోచుకోక శ్రమదోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రి కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా జీతభత్యాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఈ నెల 28న వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ ప్రదర్శన, కార్మిక సభకు మెడికల్ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం డివిజన్ కార్యదర్శి విశ్వనాథులు లెనిన్‌తో పాటు యాదగిరి, నిర్మల, ఎల్లమ్మ, పద్మ, రామేశ్వరమ్మ, సబిత, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
