వాసాలమర్రిలో అధికారుల రీ ఎంక్వైరీ

వాసాలమర్రిలో అధికారుల రీ ఎంక్వైరీ

యాదాద్రి, వెలుగు: సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పంచాయతీ రాజ్​సహా పలు డిపార్ట్​మెంట్లకు చెందిన స్టాఫ్​ శనివారం రీ ఎంక్వైరీ ప్రారంభించారు. ఒక్కో ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది..  ఖాళీ స్థలం  ఎంత.. కొత్తగా ఎవరైన ఇల్లు కట్టారా.. అమ్మకాలు, కొనుగోళ్లు ఏమైనా జరిగాయా.. అన్న అంశాలపై ఎస్సీ కార్పొరేషన్​ఈడీ శ్యాంసుందర్​ ఆధ్వర్యంలో రీఎంక్వైరీ నిర్వహించారు. 2020 నవంబర్​లో యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని సీఎం కేసీఆర్​ దత్తత తీసుకున్నారు. అనంతరం అదే ఏడాది సర్వే చేశారు.

గత ఏడాది నవంబర్​లో గ్రామంలో మరోసారి సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం గ్రామంలో 1,763 జనాభా ఉండగా 442 ఇండ్లు, 225 ఖాళీ జాగాలు ఉన్నాయి. ఇందులో 50 గజాలలోపు 15 ఇండ్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో 100 నుంచి 150 గజాల్లో ఇండ్లు ఉన్నాయి. గ్రామంలోని ప్రతి కుటుంబానికి 200 గజాల్లో ఇల్లు నిర్మిస్తామని ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన గ్రామసభలో కొందరు తమకు 500 గజాలు, అంతకంటే ఎక్కువ జాగ ఉన్నందున నష్టపోతామని నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలోని ప్రతి ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది. ఖాళీ జాగా ఎంత ఉందో తెలుసుకోవడానికి శనివారం కొలతలు నిర్వహించారు. అదేవిధంగా ఈ మధ్య కొత్తగా ఇండ్లు కట్టారా.. ఇండ్లు లేదా ఖాళీ జాగలను అమ్ముకోవడం, కొనడం వంటివి జరిగాయా అన్నది ఆరా తీశారు. కొత్తగా కట్టిన ఇండ్లలో ఎక్కువగా రోడ్డు మధ్యకు వచ్చినవాటిని గుర్తించే ప్రక్రియ నిర్వహించారు. 

త్వరగా పునర్నిర్మాణ ప్రక్రియ
వాసాలమర్రిలో సీసీ రోడ్ల కోసం మార్కింగ్ ​చేపట్టనున్నారు. గ్రామంలోని మెయిన్​ సీసీ రోడ్డు 40 ఫీట్లు, ఇంటర్నల్​ రోడ్లు 30 ఫీట్ల వైశాల్యంతో నిర్మించాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా ఇప్పుడున్న రోడ్డు మధ్య నుంచి 15 ఫీట్ల చొప్పున సీసీ రోడ్డు కోసం, ఆ తర్వాత కొంత ఖాళీ జాగా గుర్తించి  సోమవారం మార్కింగ్​ చేయనున్నారని తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా వాసాలమర్రి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన గ్రామసభలో గొడవ జరిగినప్పటికీ పునర్నిర్మాణానికి ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో మార్కింగ్​ ప్రక్రియ ముగియగానే.. గ్రామస్థుల కోసం టెంపరరీగా నివాసాలు ఏర్పాటు చేయడనానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. పునర్నిర్మాణ ప్రక్రియ స్టార్ట్​ చేయడంతో పాటు ఏడాదిలోగా కంప్లీట్​ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.