భూములు, ఇండ్ల బాధితులే ఎక్కువ.. సీఎం ప్రజావాణికి 2 వేల 445 అర్జీలు

భూములు, ఇండ్ల బాధితులే ఎక్కువ.. సీఎం ప్రజావాణికి 2 వేల 445 అర్జీలు

పంజాగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బేగంపేటలోని మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన వచ్చింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన  ప్రజలు అర్జీలను అధికారులకు అందజేశారు. ముఖ్యంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్​ కార్డులు మంజూరు కోరుతూ ఫిర్యాదులు ఇచ్చారు. పోలీసు కానిస్టేబుల్​నియామకాల్లో జీవో నం. ​46 ను దాచి మోసం చేశారని,  అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కానిస్టేబుల్​విద్యార్థుల సమితి ఫిర్యాదు చేసింది. 

తల్లితండ్రులు, విద్యార్థులు తెలుసుకోకపోతే భవిష్యత్​తరాలు నష్టపోతాయని ఆకాష్​,శంకర్​ తెలిపారు. 2022  ఏప్రిల్ లో వచ్చిన ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో  9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నామని, నాలుగైదు రకాల పోస్టులకు ఒక్కో అభ్యర్థికి 4000 వరకు  ఫీజులు వసూలు చేసి  పరీక్ష మాత్రం ఒకటే ఏర్పాటు దానిలో ఉత్తీర్ణత సాధిస్తేనే  మిగతా  అర్హత అన్నట్టు ప్రకటించారన్నారు. 

పోలీసు బోర్డులో జరిగిన అవినీతి, అవకతవకలపై  నిజ నిర్ధారణ కమిటీ  వేయాలని ప్రజావాణికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రజావాణి నోడల్​అధికారి దాసరి హరిచందన ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ కో –ఆర్డినేట్ చేశారు. మొత్తం వివిధ అంశాలపై 2,445 ఫిర్యాదులు వచ్చాయి.  

రాహుల్​ ప్రధాని కావాలంటూ..

2024 ఎన్నికల్లో రాహుల్​గాంధీ ప్రధాని కావాలంటూ దేశ వ్యాప్తంగా యాత్ర చేపడతామంటూ డాక్టర్​మహ్మద్​ఇమామ్​ టీం ,ప్లకార్డులతో  ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగాలంటే రాహుల్​గాంధీ ఈదేశానికి ప్రధాని కావ​లసిన అవశ్యకత ఉందన్నారు.

వెరిఫికేషన్ కు పిలవలే..

ఒకటో తరగతి నుంచి ఐదు వరకు మలక్ పేటలో చదివా. 2004లో ఏపీలోని కృష్ణాజిల్లాలో 7వ తరగతి చదివా. అయితే, 8వ తరగతి నుంచి బీఎస్సీ నర్సింగ్ తెలంగాణలోనే చదివా. ఇటీవల నర్సింగ్ జాబ్ కు ఎగ్జామ్స్ రాస్తే 58 మార్కులు వచ్చాయి.  స్థానికత లేదంటూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు పిలవలేదు.  ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన.  ప్రభుత్వం ఎలాగైనా న్యాయం చేయాలి.

-బి. సుజాత, బీఎస్సీ నర్సింగ్, మామిడిపల్లి,  బాలాపూర్ మండలం, రంగారెడ్డి 

సర్టిఫైడ్ కాపీ ఇస్తలేరు

మా గ్రామంలో 30 ఏండ్ల కిందట భూమి కొని సాగు చేసుకుంటున్న. మొత్తం 3.27 గుంటల భూమికి పట్టా ఉంది. అందులో 20 గుంటలను మా గ్రామానికి చెందిన వ్యక్తే కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు. ఆ భూమి తనదేనంటూ నాలుగేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీనిపై స్థానిక పీఎస్, జిల్లా కలెక్టర్ కు కంప్లయింట్ చేశా. కోర్టు ఆదేశాలతో సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. అయితే, సర్టిఫైడ్ కాపీ కావాలని దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీవో, డిప్యూటీ ఇన్ స్పెక్టర్, సర్వేయర్ స్పందించట్లేదు. 

పబ్బ వెంకట రమణయ్య, నల్లగుంట,  వెంకటాపూర్ మండలం, ములుగు