జంట జలాశయాల నీటి మట్టాలను తగ్గిస్తున్న అధికారులు

జంట జలాశయాల నీటి మట్టాలను తగ్గిస్తున్న అధికారులు
  • గత ఇబ్బందుల దృష్ట్యా ముందస్తుగా అలర్ట్
  • వానలు పడిన వెంటనే రిజర్వాయర్లు ఫుల్
  • ఆ వెంటనే గేట్లు ఓపెన్ చేసి వదులుతున్న నీరు

హైదరాబాద్, వెలుగు: జంట జలాశయాల నీటి మట్టాలను తగ్గిస్తున్నారు. ఈనెల మొదట్లో వర్షాలు కురిసే సమయానికి ముందే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లు ఫుల్ అయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వానలతో నిండిన కారణంగానే వెంటనే గేట్లు ఓపెన్ చేశారు. ఇలా గతేడాది నుంచి నీరు ఫుల్ గా ఉంటుండగా వానలు పడిన ప్రతిసారి ఇవే ఇబ్బందులు వస్తున్నాయి.  ఇక మీదట అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తుంది. వర్షాలు తగ్గినా కూడా నీటిని బయటకు పంపిస్తున్నారు. ఈనెల 5న ఓపెన్ చేసిన గేట్లను10 రోజుల పాటు కంటిన్యూగా ప్రాజెక్టుల నుంచి నీటిని మూసీలోకి వదిలారు. ఎఫ్టీఎల్ కి రెండు ఫీట్ల మేర తగ్గించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతోనే గేట్ల ద్వారా నీటిని వదులుతున్నట్లు తెలిసింది.

గతేడాదిని మించే చాన్స్

లాస్ట్ ఇయర్ వర్షాకాలానికి ముందే ఉస్మాన్​ సాగర్, హిమాయత్ సాగర్ ఫుల్ గా నిండాయి. వానలు మొదలైనప్పటి నుంచి గేట్లు ఓపెన్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇన్ ఫ్లో తగ్గకపోగా ఏం జరుగుతుందోనని అధికారులు టెన్షన్ పడిన రోజులు ఉన్నాయి. ఉస్మాన్ సాగర్ కు 15 గేట్లు ఉండగా, ఎప్పుడు లేని విధంగా గతేడాది ఒకటి, రెండు రోజులపాటు 12 గేట్లను ఓపెన్ చేశారు. హిమాయత్ సాగర్ నుంచి కూడా ఎన్నడు లేని విధంగా గతేడాది 5.912 టీఎంసీల నీటిని మూసీలోకి వదిలారు. ఇన్ ఫ్లో పెరిగిన సమయంలో గేట్ల సంఖ్యను పెంచడం, ఇన్ ఫ్లో తగ్గిన టైమ్ లో గేట్లను తగ్గిస్తూ మెయింటెన్ చేశారు. ఈసారి ఇప్పటికే 15 రోజులకిపైగా గేట్లను ఓపెన్ చేశారు. వచ్చేనెలలో భారీ వర్షాలుకురిసే చాన్స్​ ఉండటంతో ఎన్నిరోజులు ఓపెన్ చేస్తారనేది చూడాల్సి ఉంది.

పూర్తిస్థాయిలో వినియోగిస్తే మేలు

నీరు మూసీ పాలు కాకుండా సిటీలో ప్రజల అవసరాలకు  వినియోగిస్తే భవిష్యత్ లో ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. ప్రధానంగా సమ్మర్ లో జలాశయాల నీటిని వినియోగిస్తే వానాకాలంలో మళ్లీ పూర్తిగా నిండే వీలుంటుంది. కానీ వాడకపోతుండడంతోనే పరిస్థితి తలెత్తింది. దీంతోనే వానలు పడిన ప్రతిసారి గేట్లు ఓపెన్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది నుంచి నీరు వృథా చేస్తున్నారు.