ప్రజావాణికి 1,669 ఫిర్యాదులు

ప్రజావాణికి 1,669 ఫిర్యాదులు

పంజాగుట్ట, వెలుగు :  బేగంపేటలోని జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1,669 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2017లో ఏర్పడిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో రీసోర్స్ పర్సన్లుగా చేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించట్లేదంటూ ఉద్యోగులు ప్రజాభవన్ ఆవరణలో బైఠాయించారు. జీవో నం.164 ప్రకారం గౌరవ వేతనం ఇవ్వాలని, ఐడీ కార్డులు, రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. 

నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ వారితో మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్, జనవరి నెల జీతాలు చెల్లించాలంటూ తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్షరాలు సునీత, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 3,800 మంది విద్యుత్ మీటర్ల​ రీడర్లుగా పనిచేస్తున్నామని.. 

తమకు కనీసం వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. బీఎడ్ అభ్యర్థులను ఎంపిక చేయాలని, భూ సమస్యలు, ఇండ్లు కావాలని, ఉద్యోగ సమస్యలపై ఫిర్యాదుల అందినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 18 కౌంటర్లలో అధికారులు జనాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.