తాడ్వాయి, వెలుగు : ఆదివాసి గిరిజనులకు జీవన ఉపాధి కల్పించి అభివృద్ధి పదంలో నడిపించేందుకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సూచనల మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దత్తత తీసుకున్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తిలో అధికారులు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గవర్నర్ ఆదేశాల మేరకు దత్తత గ్రామానికి ఆయన నియమించిన ముగ్గురు సభ్యులు సుధాకర్ బృందం, స్థానిక ఎంపీవో శ్రీధర్ రావు, ఆర్ఐ సాంబయ్య, మండల సమైక్య సీసీ పూనెం నరసింహులుతో కలిసి ఆదివారం గ్రామాన్ని సందర్శించారు.
గుత్తె కోయ గూడెంను కలుపుకొని అందరితో స్కూలు వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ, మహిళలకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పిస్తామని తెలిపారు. గ్రామంలో టీములను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చు పటేల్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.