బతికుండగనే చంపేసినరు

బతికుండగనే చంపేసినరు

    ఒకరి బదులు మరొకరి పెన్షన్​తొలగింపు

    అధికారులను నిలదీసిన కుటుంబీకులు

గంగాధర, వెలుగు: బతికున్న వృద్ధురాలిని అధికారులు రికార్డుల్లో చంపేశారు. పెన్షన్ ​ఆగిపోవడంతో కుటుంబీకులు ఆరా తీయగా విషయం
వెలుగులోకి  వచ్చింది. కరీంనగర్​ జిల్లా గంగాధర  మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన ఇరుగురాల పోచమ్మ అనే వృద్ధురాలికి పెన్షన్​సొమ్మే ఆసరా. ఎప్పటిలాగే పెన్షన్​ డబ్బు తీసుకుందామని ఇటీవల బ్యాంకుకు వెళ్లిన ఆమెకు డబ్బులు పడలేదని తెలిసింది. దీంతో తోటివారిని అడిగింది. వారికి డబ్బులు వచ్చాయని చెప్పడంతో ఆమె కుటుంబసభ్యులు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి వాకబు చేశారు. ఆమె ఆధార్​ కార్డు ద్వారా ఆసరా వెబ్​సైట్​లో పరిశీలించగా చనిపోయినట్లుగా నమోదు చేసి ఉంది. పోచమ్మ బతికుండగానే చనిపోయినట్లుగా చూపి తన పెన్షన్​ఎలా నిలిపివేస్తారని కుటుంబసభ్యులు కార్యదర్శి, ఎంపీడీవోను నిలదీశారు. కార్యదర్శిని ఎంపీడీవో అడగగా అదే పేరుతో మరో మహిళ ఉందని, భర్త పేరు మాత్రం వేరని తెలిపాడు. ఆమె బదులు పొరపాటున ఈమె పేరు డిలీట్​అయ్యిందని చెప్పాడు. కార్యదర్శి పొరపాటుతో పోచమ్మకు పెన్షన్​ఆగిపోయిందని, విషయాన్ని ఆర్డీవోకు వివరించి పెన్షన్​ పునరుద్ధరిస్తామని ఎంపీడీవో వృద్ధురాలి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.  తనకు రెండు నెలల పెన్షన్​ రావాల్సి ఉందని, పెన్షన్​ నిలిపివేతపై విచారణ జరిపి న్యాయం చేయాలని పోచమ్మ కోరుతోంది.