కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ?

V6 Velugu Posted on Nov 25, 2021

హైదరాబాద్​, వెలుగు: మూడేండ్ల నుంచి రాష్ట్ర సర్కారు కొత్త ఆసరా పింఛన్లను మంజూరు చేయట్లేదు. 57 ఏండ్లు నిండినోళ్లతో పాటు ఆ రూల్​తో సంబంధం లేని వాళ్లకూ పెన్షన్లను ఇవ్వట్లేదు. దరఖాస్తులు పెట్టుకున్నా వాటిని కనీసం పట్టించుకోవట్లేదు. 14 లక్షలకుపైగా దరఖాస్తులను పెండింగ్​లో పెట్టేసింది. 57 ఏండ్లు నిండినోళ్లందరికీ ఆసరా పింఛన్ల కోసం ఆగస్టు, అక్టోబర్​లలో రెండుసార్లు ప్రభుత్వం అప్లికేషన్లను తీసుకుంది. దాదాపు 10.5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కానీ, సర్కారు ఇప్పటిదాకా వాటిని వెరిఫై చేయనేలేదు. ఏ శాఖ అధికారులు వెరిఫై చేయాల్నో కూడా ఆదేశాలివ్వలేదు. లబ్ధిదారుల గుర్తింపుకు పాటించాల్సిన గైడ్​లైన్స్​నూ ప్రకటించలేదు. ఆగస్టు నుంచే కొత్త పింఛన్లను ఇస్తామని సీఎం కేసీఆరే గతంలో ప్రకటించినా.. ఆ గడువు దాటి నాలుగు నెలలవుతున్నా ఇప్పటికీ ఆ హామీ నెరవేరట్లేదు. ఈ మధ్య ఉప ఎన్నిక జరిగిన హుజూరాబాద్​లో మాత్రమే పింఛన్లను ఇచ్చిన సర్కారు.. రాష్ట్రంలో ఎక్కడా కొత్త పింఛన్లను ఇవ్వలేదు.  

ఏజ్​ మాత్రమే తగ్గించిన్రు
ఈ ఏడాది జులైలో సిరిసిల్ల పర్యటన సందర్భంగా 57 ఏండ్లు నిండినోళ్లందరికీ ఆసరా పింఛన్లను ఇస్తామంటూ సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. కానీ, జస్ట్​ వయసు తగ్గిస్తూ ఆగస్టులో ఉత్తర్వులను విడుదల చేశారే తప్ప.. పింఛన్లను ఇవ్వలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా అధికారులు సిద్ధం చేసిన అర్హుల లిస్ట్​ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ.. మరోసారి మీ సేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 15 నుంచి 31 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. దాదాపు 9.50 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వాళ్లకు సెప్టెంబర్​లో ఆసరా పింఛన్​ వస్తుందని అనుకున్నా.. సర్కార్​ మాత్రం పట్టించుకోలేదు. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు అక్టోబర్​ 1 నుంచి 31 వరకు మరోసారి అప్లికేషన్లు పెట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో మరో లక్ష మంది అప్లై చేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ గడువు ముగిసి రెండు వారాలు కావస్తున్నా ఇప్పటి వరకు వెరిఫికేషన్​ ప్రాసెస్​ను ప్రారంభించలేదు. దీంతో ఆగస్టులో ఇస్తామన్న పెన్షన్​ నవంబర్​లో కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. 

57 ఏండ్ల రూల్​తో సంబంధం లేనోళ్లకూ స్టాప్​!
సీఎం కేసీఆర్​ రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త పింఛన్ల మంజూరును దాదాపుగా ఆపేశారు. మూడేండ్లుగా కొత్త పింఛన్లను ఇవ్వట్లేదు. ప్రమాదాల్లో కాళ్లూచేతులు పోగొట్టుకున్నోళ్లు, భర్త చనిపోయిన మహిళలు, బోదకాలు బాధితులు, 55 ఏండ్లు నిండిన గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, పాత రూల్​ ప్రకారం 65 ఏండ్లు నిండిన వృద్ధుల నుంచి పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీవోలు అప్లికేషన్లను తీసుకుని, అర్హులను గుర్తించి ఎప్పటికప్పుడు ఎంపీడీవో లాగిన్​లో ఆన్​లైన్​ చేస్తున్నారు. ప్రతి నెలా సగటున ఇలాంటి అప్లికేషన్లు 10 వేల దాకా వస్తున్నాయి. ఈ మూడేండ్లలో మూడున్నర లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. అప్లికేషన్లన్నింటినీ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ అధికారులు వెరిఫై చేసి సర్కారుకు జాబితాను పంపిస్తున్నారు. ఆ జాబితా మొత్తం ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. ఆన్​లైన్​లోనూ అప్లికేషన్లను అప్రూవ్డ్​ అని చూపిస్తున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో పింఛన్లను మంజూరు చేయట్లేదని అధికారులు వాపోతున్నారు. 57 ఏండ్ల రూల్​తో వీళ్లకు ఏ సంబంధం లేకపోయినా.. వారి అప్లికేషన్లను పెండింగ్​లో పెట్టి ఇబ్బందులు పెడుతోంది.

Tagged CM KCR, Telangana Govt, Old age pensions, telangana pension shceme

Latest Videos

Subscribe Now

More News