
గత మూడురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జనజీవనం స్తంభించిపోయింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో బేగంబజార్ లో ఓ పురాతన బిల్డింగ్ కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో బిల్డింగ్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గురువారం ( ఆగస్టు 14 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బేగంబజార్ లోని.... ఓ పురాతన బిల్డింగ్ కుప్పకూలింది. శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్ కూల్చేయాలని గతంలోనే GHMC అధికారులు నోటీసులిచ్చినా పట్టించుకోలేదు బిల్డింగ్ ఓనర్. బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకున్నా కూడా అందులోనే షాపులు కొనసాగిస్తున్నారు వ్యాపారులు. బేగంబజార్ లో ఇలాంటి శిథిలావస్థకు చేరుకున్న పురాతన బిల్డింగ్స్ చాలా ఉన్నాయని అంటున్నారు స్థానికులు.
రద్దీ ఎక్కువగా ఉండే బేగంబజార్ లాంటి ఏరియాలో పురాతన బిల్డింగ్స్ ఉండటం చాలా ప్రమాదకరమని.. కూలిపోయే స్థితిలో ఉన్న బిల్డింగ్స్ ని కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. వర్షాకాలంలో ఇలాంటి బిల్డింగ్స్ ఎప్పుడు కూలిపోతాయోనన్న భయంతో గడపాల్సి వస్తుందని అంటున్నారు స్థానికులు. జీహెచ్ఎంసీ అధికారులు కేవలం నోటీసులిచ్చి వదిలేయకుండా.. తక్షణమే ఇలాంటి బిల్డింగుల కూల్చివేతలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.