భూ సెటిల్ మెంట్లకు జడ్జిగా అవతారం

భూ  సెటిల్ మెంట్లకు జడ్జిగా అవతారం
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఉప్పల్​, వెలుగు:  పాత నేరస్తుడు  జడ్జిగా అవతారమెత్తి  భూసెటిల్​ మెంట్లు చేస్తూ పోలీసులకు చిక్కాడు. అతనితో పాటు మాజీ సైనికుడిని అరెస్టు చేసి ఒక పిస్తల్, ఐదు రౌండ్ల బులెట్లు, రెండు పిస్టల్​ మ్యాగజైన్లు, రూ.7500 నగదు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్​ పీఎస్ లో  శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ జానకి మీడియాకు వివరాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లాకు చెందిన నామాల నరేందర్​రెడ్డి (31) ఉపాధి కోసం సిటీకి వచ్చి రామంతాపూర్​ భరత్ నగర్​లో ఉంటూ రియల్​ఎస్టేట్ చేసేవాడు. 

వచ్చే సంపాదన సరిపోక చోరీలు చేస్తూ అరెస్ట్ అయి పలుమార్లు జైలుకు వెళ్లాడు. 2018లో  విడుదలైన నరేందర్​రెడ్డి ఖమ్మంలో  అసిస్టెంట్ జిల్లా జడ్జినంటూ భూ వివాదాల కేసులను పరిష్కరిస్తానంటూ అమాయకుల వద్ద డబ్బులు తీసుకుని మోసగించి జైలు వెళ్లి బయటకు వచ్చాడు. అమీర్​పేట్​లో ఉండే వెబ్ డిజైనర్ సంతోష్​ను కలిసి తెలంగాణ హైకోర్టు అడిషనల్​ సివిల్​ జడ్జి పేరుతో  ఫేక్​ప్రొఫైల్​ తయారు చేయించాడు.  

మాజీ సైనికు డు  చిక్కం మధుసూదన్​రెడ్డి(41)ని గన్​మెన్ గా నియమించుకుని నరేందర్ రెడ్డి భూ దందాలు, సెటిల్​మెంట్లు చేస్తున్నాడు. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన గార్లపాటి సోమిరెడ్డికి చెందిన మహబూబాబాద్​ జిల్లా  ఖానాపూర్​లోని భూమి ముటేషన్​ క్లియర్​ చేసేందుకు రూ.10లక్షలు తీసుకుని తిప్పించుకుంటున్నాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు సోమిరెడ్డి   ఫిర్యాదు చేయగా ఉప్పల్​ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్​ఓటీ పోలీసులు నరేందర్​రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ జడ్జిగా తేలింది. అతనితో పాటు గన్ మెన్ మధుసూదన్​రెడ్డిని అరెస్టు చేశారు.