అమెరికాలో కొత్త ట్రెండ్... ఆఫీస్ ఇల్లు అవుతుంది

అమెరికాలో కొత్త ట్రెండ్... ఆఫీస్ ఇల్లు అవుతుంది
  • అమెరికాలో ఆఫీసులు ఇండ్లయితున్నయ్
  •  అపార్ట్‌‌‌‌మెంట్లుగా హోటళ్లు, కార్యాలయాల మార్పు
  •  వ్యాపారం సాగని బిల్డింగులను కొంటున్న డెవలపర్లు
  •  జోరుగా ‘అడాప్టివ్ రీయూజ్’
  •  గతేడాది 20 వేలకుపైగా అపార్ట్‌‌‌‌మెంట్లు కట్టిన్రు

వాషింగ్టన్: కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అమెరికా నుంచి అమీర్‌‌‌‌‌‌‌‌పేట దాకా ఇదే పరిస్థితి. ఎన్నో సంస్థలు మూతబడ్డాయి. ఒకప్పుడు ఉద్యోగులతో నిండిపోయిన ఆఫీసులు ఇప్పుడు వర్క్‌‌‌‌ ఫ్రమ్ హోమ్‌‌‌‌తో ఖాళీ అయ్యాయి. ఖాళీగా పెట్టి అద్దె ఎందుకు కట్టాలని భావించిన చాలా ఐటీ కంపెనీలు తమ ఆఫీసులను చిన్న స్పేస్‌‌‌‌కు షిఫ్ట్ చేసుకున్నాయి. అమెరికాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో గిరాకీ లేక హోటళ్లు బంద్ అయ్యాయి. ఇలా హోటళ్లు, ఐటీ, కార్పొరేట్ ఆఫీసులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు చాలా వరకు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో వాటిని ఇండ్లుగా మారుస్తున్నారు. ఆఫీసులకు పెద్దగా అద్దె రాకపోవడం, ఇండ్ల రెంట్‌‌‌‌కు డిమాండ్ ఉండటంతో అగ్రరాజ్యంలో ఇప్పడిదే ట్రెండ్‌‌‌‌గా మారింది.

కోవర్కింగ్ స్పేసులు ఏర్పాటు 
గతేడాది మార్పులు చేసిన ప్రాపర్టీలతో సుమారు 20,100 అపార్ట్‌‌‌‌మెంట్లు నిర్మించినట్లు అపార్ట్‌‌‌‌మెంట్ లిస్టింగ్ సర్వీస్ ‘రెంట్‌‌‌‌ కేఫ్’ జరిపిన సర్వేలో తేలింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు. ఈ కన్వర్షన్ల వల్ల అమెరికాలోని కీలక వ్యాపార ప్రాంతాలకు ఆదాయం వస్తోంది. రెండేళ్ల కిందట కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావడం మానేశారు. దీంతో అప్పటి నుంచి ఆఫీసులు ఖాళీగా ఉండటంతో స్థానిక వ్యాపారులు, ల్యాండ్‌‌‌‌లార్డ్స్‌‌‌‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇలా కన్వర్ట్ చేస్తున్న అపార్ట్‌‌‌‌మెంట్లలో కోవర్కింగ్ స్పేసులను ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది వర్క్‌‌‌‌ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తుండటంతో వారికి అనువుగా మారుస్తున్నారు. 

ఇండ్లకు అందుబాటు ధరలు
మరోవైపు అమెరికాలో ఇండ్ల రెంట్లు భారీగా ఉంటున్నాయి. అమెరికా గవర్నమెంట్ అకౌంటబులిటీ ఆఫీసు సర్వే చేయగా.. తమకు రెంట్లు భారంగా మారాయని 48 శాతం మంది చెప్పారు. తమ ఆదాయంలో 30 శాతం ఇంటి అద్దెకే పోతోందని వాపోయారు. ఇప్పుడు ఆఫీసు స్పేస్‌‌‌‌లను అపార్ట్‌‌‌‌మెంట్ల కింద మార్చడం వల్ల.. అందుబాటు ధరలో ఇండ్లు దొరుకుతున్నాయి. రెంట్లు భారీగా ఉంటున్న వాషింగ్టన్‌‌‌‌ లాంటి సిటీల్లో రేట్లు కాస్త తగ్గే అవకాశం ఉంది. ‘‘మేం మరిన్ని ఇండ్లను అందుబాటులోకి తేవాలి. సప్లై పెంచాలి. అట్ల చేస్తే.. భారీగా ఉన్న ఇండ్ల ధరలు, రెంట్లు తగ్గుతాయి” అని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రాయిటర్స్ చీఫ్ ఎకనమిస్ట్ లారెన్స్ యున్ అన్నారు.

వైట్‌‌‌‌హౌస్‌‌‌‌లోని బ్లాక్స్‌‌‌‌ కూడా..
వైట్‌‌‌‌హౌస్‌‌‌‌లోని కొన్ని బ్లాక్‌‌‌‌లను, వాషింగ్టన్‌‌‌‌లోని వ్యాపార ప్రాంతంలో గతంలో యూఎస్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఉపయోగించిన భవానాన్ని ఇప్పుడు వందలాది మంది ఉండేందుకు వీలుగా ఇండ్లలా మారుస్తున్నారు. 2021లో అమెరికా ప్రాపర్టీ మార్కెట్‌‌‌‌ను శాసించిన ‘అడాప్టివ్ రీయూజ్’ ప్రాజెక్టులో భాగంగా ఖాళీగా ఉన్న ఆఫీసులను ట్రాన్స్‌‌‌‌ఫామ్ చేస్తున్నారు. బిజినెస్ సరిగ్గా సాగని ఆఫీసులు, హోటళ్లను డెవలపర్లు కొనుగోలు చేసి, అపార్టుమెంట్లుగా అభివృద్ధి చేస్తున్నారు. న్యూయార్క్‌‌‌‌లోని 14- అంతస్తుల భవనాన్ని 255 అపార్ట్‌‌‌‌మెంట్లుగా మారుస్తున్నట్లు ప్రాపర్టీ డెవలప్‌‌‌‌మెంట్ సంస్థ ‘ఫౌల్గర్ ప్రాట్’ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ అబ్రమ్స్ చెప్పారు. ‘‘మార్కెట్ మారింది. ఈ భవనాన్ని ఆఫీసు స్థలంగా కొనసాగించడం కంటే.. అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌గా మారిస్తే వచ్చే విలువ ఎక్కువ. ఆఫీస్ మార్కెట్ రికవరీ స్లోగా ఉంది. ఖాళీగా ఉన్న ఆఫీస్ బిల్డింగ్​లను అట్లనే కొనసాగించడం వల్ల ఖర్చు పెరుగుతోంది” అని చెప్పారు.