పెన్షన్ల కోసం వృద్దుల అవస్థలు

పెన్షన్ల కోసం వృద్దుల అవస్థలు

ఏపీలో వాలంటీర్ వార్ రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీని ఎన్నికల సంఘం రద్దు చేయటంతో వృద్దులు, వికలాంగులకు ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే టంచను అందే పెన్షన్ ఆగిపోయింది. పెన్షన్ పంపిణీ కోసం ప్రత్యామ్నాయాలను వాడుకోవాలని ఎన్నికల సంఘం సూచించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో వృద్దులు ఈ తెల్లవారుజాము నుండే సచివాలయ కేంద్రాల వద్ద క్యూలు కట్టారు. అయితే, పెన్షన్ కి సంబంధించిన సొమ్ము బ్యాంకుల్లో జమ కావటం ఆలస్యం అవ్వటంతో పెన్షన్ పంపిణీ చాలా చోట్ల ప్రారంభం కాలేదు. దీంతో వృద్దులు, వికలాంగులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. మరి కొన్ని చోట్ల పెన్షన్ రేపు ఇస్తామని చెప్పటంతో వృద్దులు, వికలాంగులు వెనుదీరాల్సి వచ్చింది. చాలా చోట్ల వృద్దులు ఎండ వేడిమికి తాళలేక సొమ్మసిల్లిన ఘటనలు కూడా జరిగాయి.