గత నెలలో దేశంలోని ఆయిల్ కంపెనీలు నాలుగు విడతల్లో పెట్రోల్ డీజిల్ ధరలను లీటరుకు దాదాపు రూ.7 పెంచిన సంగతి తెలిసిందే. రేట్ల పెంపు ఇక్కడితో ఆగబోదని అందరికీ తెలుసు. ఈసారి ఇంధన ధరలను ఎంత పెంచుతారు.. ఏ సమయంలో పెంచుతారు అనే అంశాలు వాహనదారులతో పాటు ట్రాన్స్ పోర్ట్ వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
దేశంలో వాహనదారులపై పెట్రోల్, డీజిల్ ధరల భారం మరింత పడబోతోందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరగడంతో, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి రానున్న రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా 12 రూపాయల వరకు పెంచాల్సి ఉంటుందని విశ్లేషకుల అంచనా. గత నెలలోనే 4 సార్లు ఇంధన ధరలను పెంచినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అవి నష్టాలను భర్తీ చేయడానికి ఏమాత్రం సరిపోవడం లేదంట.
పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దగ్గరలో కొనసాగుతోంది. దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలకు లీటర్ పెట్రోల్‌పై రూ.5.5, లీటర్ డీజిల్‌పై రూ.4.5 వరకు నష్టాలు వస్తున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయంగా విక్రయిస్తున్న ఇంధనంపై అసలు నష్టం పెట్రోల్‌పై రూ.24, డీజిల్‌పై రూ.30 వరకు కూడా ఉంటోందని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల ఈ మూడు కంపెనీలు రోజుకు దాదాపు 550 కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తోందట. ఈ త్రైమాసికంలో వీటి మొత్తం నష్టాలు దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరొచ్చని నిపుణులు అంటున్నారు.
వాహన ఇంధనాలే కాకుండా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్లపై రూ.650, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) లేదా జెట్ ఫ్యూయల్‌పై లీటరుకు రూ.30 చొప్పున కంపెనీలు నష్టాలను భరిస్తున్నాయి. ప్రస్తుతానికి చమురు కంపెనీలకు ఎటువంటి ఆర్థిక ప్యాకేజీ లేదా పరిహారం ఇచ్చే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు. అందువల్ల నష్టాల తీవ్రతను తగ్గించుకోవడానికి తక్షణ ఉపశమనంగా లీటరుకు రూ.2 నుండి రూ.4 వరకు ధరలను పెంచే యోచనలో కంపెనీలు ఉన్నాయి. ఒకవేళ అంతర్జాతీయంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, ముడి చమురు ధరలు తగ్గకపోతే రాబోయే రోజుల్లో ధరల పెంపు తప్పనిసరి కానుంది.
