- 2022 జూన్ 18న హీరాబెన్ 100వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ తన తల్లి గురించి బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఆమె జీవితంలోని త్యాగాలను వెల్లడించారు. తన మనస్సు, వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మలిచిన తీరును వివరించారు.
- అందరు తల్లుల మాదిరే నా తల్లి కూడా ఎంత సింపులో.. అంతే అసాధారణమైన వ్యక్తి కూడా. పేదల సంక్షేమంపై గట్టి సంకల్పంతో ముందుకెళ్లేందుకు, దృష్టి పెట్టడానికి నా తల్లి ఎల్లప్పుడూ నన్ను ప్రేరేపించేది.
- 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆశీర్వాదం తీసుకునేందుకు అమ్మ వద్దకు వెళ్లాను. ‘నువ్వు ప్రభుత్వంలో ఎందుకు పనిచేస్తున్నావో తెలియదు. కానీ లంచం తీసుకోవద్దు’ అని కోరింది తను.
- నాకు పాఠాలు చెప్పిన టీచర్లందరినీ సన్మానించాలని అనుకున్నా. వారితోపాటు అమ్మను కూడా గౌరవించాలని భావించా. కానీ అమ్మఅందుకు ఒప్పుకోలేదు. ‘నేనొక సాధారణ వ్యక్తిని. నేను జన్మనిచ్చాను.. కానీ నీకు చదువు చెప్పి, పెద్ద చేసిన వాళ్లే గొప్ప’ అని చెప్పింది.
- ఆమె ఆలోచనా విధానం, దూరదృష్టితో కూడిన ఆలోచన నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉండేది. దృఢత్వానికి చిహ్నంలా అమ్మ ఉండేది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుని, ఎన్నో కష్టనష్టాలను చవిచూసింది.
- మా కుటుంబం వాద్‌నగర్‌లోని ఒక చిన్న మట్టి ఇంట్లో ఉండేది. వానొస్తే ఇల్లు కారేది. నీళ్లు కారుతున్న చోట బకెట్లు, వంటపాత్రలు పెట్టేది. ఇల్లు గడిచేందుకు కొన్ని ఇండ్లలో పాత్రలు కడిగేది. చరఖా తిప్పేది.
- మా అమ్మ ఇతరుల సంతోషాల్లోనే ఆనందాన్ని పొందుతుంది. చాలా పెద్ద మనసున్న వ్యక్తి. తన మిత్రుడు చనిపోవడంతో ఆయన కొడుకు అబ్బాస్‌ను మా నాన్న ఇంటికి తీసుకొచ్చారు. అబ్బాస్‌ను మాలాగే ప్రేమగా చూసుకుంది.
- నా తల్లి జీవిత కథలో.. నేను భారతదేశపు మాతృశక్తి తపస్సు, త్యాగం, సహకారం చూస్తా ను. మా అమ్మను, ఆమె వంటి కోట్లాది మంది మహిళలను చూసినప్పుడల్లా.. భారతీయ మహిళలకు సాధించలేనిదంటూ ఏదీ లేదనుకుంటాను అని ప్రధాని రాసుకొచ్చారు.
- వందేండ్ల ప్రయాణం ముగిసింది..
- తన తల్లి హీరా బెన్ మృతిపై ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘వందేండ్ల గొప్ప జర్నీ ముగిసింది. అమ్మలో నేను మూడు లక్షణాలను చూశాను. ఓ తపస్విగా, నిస్వార్థ సేవకురాలిగా, విలువలకు అంకితమై.. జీవితం గడిపారు” అని పేర్కొన్నారు. 100వ పుట్టిన రోజు నాడు వెళ్లి కలిసినప్పుడు.. ‘నీ బుద్ధిని ఉపయోగించి పని చేయి.. స్వచ్ఛతతో జీవించు’ అని తన తల్లి చెప్పిందని గుర్తు చేసుకున్నారు.

