
సూర్యగ్రహణం కారణంగా జూన్ 21న పూర్తిగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. అలాగే కొన్ని ఆర్జిత సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు రద్దు చేసినట్లు తెలిపింది. ఆదివారం ఉదయం 10.18 గంటల నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని, దీంతో శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ తర్వాత మూసిన శ్రీవారి ఆలయ తలుపులను జూన్ 21న మధ్యాహ్నం 2.30 గంటలకు తెరుస్తామని చెప్పింది. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహవచనం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోపల పంచాంగ శ్రవణం నిర్వహిస్తారని తెలిపింది. అనంతరం మొదటి అర్చన, మొదటి గంట, బలి శాత్తుమొర, రెండో అర్చన, రెండో గంట తదితరాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు చెప్పింది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శుద్ధి, రాత్రి కైంకర్యాలు, రాత్రి గంట, రాత్రి 8 నుంచి 8.30 గంటల ఏకాంతసేవ జరుగుతుందని టీటీడీ అధికారులు చెప్పారు. ఈ కైంకర్యాల కారణంగా జూన్ 21వ తేదీ నాడు పూర్తిగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం ఉండదని తెలిపారు. కల్యాణోత్సవం ఆర్జితసేవను రద్దు చేసినట్లు చెప్పారు. గ్రహణం సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ ఉండదన్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి, ఆదివారం తిరుమల యాత్రకు రావొద్దని సూచించించారు.