బషీర్ బాగ్, వెలుగు : క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామంటూ ఒకరిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి కథనం ప్రకారం..నగరానికి చెందిన 40 ఏండ్ల వ్యక్తికి సైబర్ చీటర్స్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగి పేరిట కాల్ చేశారు. బాధిత వ్యక్తి వాడుతున్న క్రెడిట్ కార్డు డియాక్టివేట్ అయ్యిందని, యాక్టివేట్ చేస్తామని నమ్మబలికారు.
అందుకోసం బాధితుడి పేరు, అడ్రస్ , క్రెడిట్ కార్డు వివరాలు తీసుకున్నారు. మరుసటిరోజు బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1,24, 905 అమెజాన్ లో షాపింగ్ కోసం వాడినట్లు మెసేజ్ వచ్చింది. తన ప్రమేయం లేకుండా డబ్బులు కట్ కావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
