రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​ ధర్నాలు

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​ ధర్నాలు

రైతు సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్​

నెట్​వర్క్, వెలుగు: ధరణి పోర్టల్ రద్దు చేయాలని.. రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్​తో సోమవారం రాష్ట్రమంతటా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. పీసీసీ పిలుపు మేరకు కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశారు. ధరణి పోర్టల్ రైతులందరూ ఇబ్బందులు పడుతన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ధర్నాల్లో పాల్గొన్న కాంగ్రెస్ లీడర్లు ప్రకటించారు. మంచిర్యాలలో ఐబీ చౌరస్తా నుంచి కలెక్టరేట్​ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు.

నిర్మల్, ఆసిఫాబాద్ కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ లీడర్లు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ధరణి పోర్టల్​తో చాలామంది రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్కమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 24 లక్షల ఎకరాలను పంపిణీ చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం 12లక్షల ఎకరాలను పార్ట్–బీలో చేర్చడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కామారెడ్డి కలెక్టరేట్​ఎదుట జరిగిన ధర్నాలో మాజీమంత్రి షబ్బీర్​అలీ పాల్గొన్నారు. కలెక్టరేట్​లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో కాంగ్రెస్​ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్ కలెక్టరేట్ల వద్ద పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లురవి, నిజామాబాద్​లో మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా లో మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు. కవితకు ఒక  న్యాయం.. సోనియాకు ఒక న్యాయమా.. ఏఐసీసీ నేత సోనియా గాంధీని ఆఫీస్ లో విచారించి.. ఎమ్మెల్సీ కవితను ఇంట్లో విచారిస్తామనడం ఏంటని మాజీఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం కొనసాగుతోందన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నాలో పాల్గొన్నారు.

కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో రూ. లక్ష రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, అదనపు వడ్డీని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. డీసీసీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. తెలంగాణలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల ఇందిరా భవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. సిరిసిల్ల కలెక్టరేట్ ను కాంగ్రెస్​ నేతలు ముట్టడించి నిరసన తెలిపారు.