మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతా శ్రమదాన్

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతా శ్రమదాన్
  • దేశవ్యాప్తంగా 9.2 లక్షలకు పైగా ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవా మెగా డ్రైవ్
  • మహాత్ముడికి స్వచ్ఛాంజలి..దేశవ్యాప్తంగా స్వచ్ఛతా శ్రమదాన్
  • 9 లక్షల ప్రాంతాల్లో నిర్వహించినట్లు కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ‘స్వచ్ఛాంజలి’ ఘటించారు. పొలిటీషియన్ల నుంచి స్టూడెంట్ల దాకా అన్ని వర్గా ల వారు స్వచ్ఛతా శ్రమదాన్‌‌లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9.2 లక్షలకు పైగా ప్రాంతాల్లో ‘స్వచ్ఛతా హీ సేవా’ మెగా డ్రైవ్ నిర్వహించినట్లు కేంద్ర అర్బన్, హౌసింగ్ శాఖ వెల్లడించింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ప్రజలందరూ ఒక గంటపాటు శ్రమదానం చేయాలని ఇటీవలి మన్‌‌కీ బాత్‌‌లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 

ఈ నేపథ్యంలో ఆదివారం అహ్మదాబాద్‌‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఎయిర్‌‌‌‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి తదితరులు శ్రమదానం చేశారు. యూపీలో లక్ష ప్రాంతాల్లో, మహారాష్ట్రలో 62 వేల లొకేషన్లలో, ఢిల్లీలో మొత్తం 500 లొకేషన్లలో ఈ  కార్యక్రమం నిర్వహించారు.

ఫిట్‌‌నెస్‌‌ ఇన్‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌తో కలిసి ప్రధాని శ్రమదానం

ఫిట్‌‌నెస్‌‌ ఇన్‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌ అంకిత్ బయాన్‌‌పురియాతో కలిసి ప్రధాని మోదీ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘నేడు దేశం స్వచ్ఛతపై దృష్టి పెడుతున్నది. అంకిత్ బయన్‌‌పురియా, నేను అదే చేశాం! కేవలం పరిశుభ్రత మాత్రమే కాదు.. మేము ఫిట్‌‌నెస్, శ్రేయస్సునూ మిక్స్ చేశాం. ఇది స్వచ్ఛత, స్వస్త్ భారత్‌‌కు సంబంధించినది” అని ట్వీట్ చేశారు. 

ఈమేరకు ఓ వీడియోను షేర్ చేశారు. హర్యానాకు చెందిన ఫిట్‌‌నెస్‌‌ ఇన్‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌ అంకిత్ బయాన్‌‌పురియా.. దేశీ వ్యాయామ విధానంతో ఫేమస్ అయ్యాడు. మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణపై దృష్టి పెట్టే ‘75 రోజుల చాలెంజ్‌‌’తో అతడి పేరు ఇటీవల మారుమోగింది. సోషల్​ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.