సోలార్ ప్లాంట్ పెడితే..మహిళా సంఘాలకు నాలుగెకరాల ప్రభుత్వ భూమి

సోలార్ ప్లాంట్ పెడితే..మహిళా సంఘాలకు నాలుగెకరాల ప్రభుత్వ భూమి
  • ఆయా సంఘాల పేర్ల మీద ఇవ్వాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్​ చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నాలుగెకరాల ప్రభుత్వ భూమిని ఆయా సంఘాల పేర్ల మీద కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మహిళా సాధికారతకు, మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు మరింత తోడ్పాటు అందించనుంది.

సంఘాల పేరు మీద భూమి కేటాయించడం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటును మరింత సులువు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించి కేటాయించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ సోలార్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అమ్ముకోవడం ద్వారా మహిళా సంఘాలకు మంచి ఆదాయం లభిస్తుంది. 

తొలుత సోలార్ పవర్ ప్లాంట్లు చేపట్టే సంఘాలకు నాలుగెకరాల భూమిని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ప్రభుత్వ భూమినే వారి పేరు మీద ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమం కింద మొత్తం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ పథకం అమలులో భాగంగా, ఒక్కో మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాలకు కేటాయించనున్నారు. 

ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.3 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తంలో 10 శాతం మహిళా సంఘాలు భరించాల్సి ఉండగా, మిగిలిన 90 శాతం బ్యాంకుల ద్వారా రుణాలుగా అందిస్తారు. మహిళా సంఘాలకు రుణాల చెల్లింపులో మంచి ట్రాక్ రికార్డు ఉన్నందున, బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.