
కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం ముదురుతోంది. కావేరీ నదీ జలాలపై రెండు రాష్ట్రాలు తమ హక్కులకోసం పోరాటం చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 26న కర్ణాటక బీజేపీ,150అనుకూల సంఘాలతో కలిసి బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చింది. కావేరీ జలాల వివాదం ప్రతి కన్నడిగను ప్రభావితం చేసే సామాజిక, ఆర్థికపరమైన ప్రాముఖ్యత కలిగినదని రాజకీయాల పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి కన్నడిగుడు సహకరించాలని బీజేపీ నేతలు కోరారు.
కన్నడ అనుకూల సంస్థ కర్ణాటక జల సంరక్షణ సమితి (కెజెఎస్‌ఎస్) కూడా సెప్టెంబర్ 26న బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. కావేరి జలాల విడుదలకు నిరసనగా అనేక ఇతర సంస్థల మద్దతుతో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు కెజెఎస్ఎస్ తెలిపింది. కేఆర్‌ఎస్ డ్యాం నుంచి తమిళనాడుకు నీటిని విడుదలను ఆపాలని కోరుతూ ఉదయం 11 గంటలకు టౌన్‌హాల్ నుంచి మైసూర్ బ్యాంక్ సర్కిల్ (ఎస్‌బీఎం సర్కిల్) వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
అయితే బంద్ లతో బెంగళూరు నగర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజుల్లో రెండు సార్లు బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు, సంఘాలు. సెప్టెంబర్ 11న కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఫెడరేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు, గూడ్స్ వాహనాలు కార్పొరేట్ బస్సులతో సహా లక్షలాది ప్రైవేట్ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. పాఠశాల విద్యార్థులకు రాకపోకలు కష్టంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, దినసరి కూలీలు ఇలా బెంగళూరు నగర ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా 26న కావేరీ జలాల వివాదంలో బంద్ కు పిలుపునిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.