ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్‌నుంచి నాగోలు వరకు రోడ్డు అధ్వానంగా మారిందని గురువారం ఓ ప్రైవేట్ఎంప్లాయ్బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తాలో ఆందోళనకు దిగింది. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలో నిలిచిన వర్షపు నీటిలో కూర్చొని నిరసన తెలిపింది. అధికారులు స్పందించి వెంటనే రోడ్డును బాగుచేయాంటూ నినాదాలు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ కుంట్లూరులోని న్యూ జీవీఆర్ కాలనీకి చెందిన నిహారిక ప్రైవేట్ ఉద్యోగి. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బండ్లగూడలోని ఓ స్కూల్లో చదువుకుంటున్న వారిద్దరినీ నిహారిక రోజూ స్కూటీపై తీసుకెళ్లి దింపొస్తుంది. అయితే ఎల్బీనగర్ – నాగోలు – బండ్లగూడ రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. ఎక్కడికక్కడ భారీ గుంతలు ఏర్పడ్డాయి.
గుంతల రోడ్డుపై జర్నీ చేయలేక నిహారిక శుక్రవారం నడిరోడ్డుపై ఏర్పడిన గుంతలో కూర్చొని నిరసనకు దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలను స్కూలుకు తీసుకెళ్లే టైంలో గుంతలోపడి తాము ఓసారి ప్రమాదానికి గురయ్యామని చెప్పింది. రోడ్లు బాగోలేవని జీహెచ్ఎంసీ మేయర్ గద్యాల విజయలక్ష్మిని ట్యాగ్చేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేసినా స్పందన లేదని వాపోయింది. గుంతల రోడ్డుపై జర్నీ చేయలేక, ఆందోళనకు దిగానని వెల్లడించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్లను బాగుచేయాలని కోరింది.
స్పందించిన స్థానిక కార్పొరేటర్, అధికారులు నిహారికను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌తో ఫోన్ లో మాట్లాడించారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె నిరసనను విరమించుకుంది. స్పందించిన అధికారులు నాగోలు, బండ్లగూడ రోడ్లపై ఏర్పడిన గుంతలను మట్టితో నింపి చదును చేశారు. అధికారుల చర్యలను చూసి స్థానికులు ముక్కుమీద వేలేసుకున్నారు. తారు రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మట్టిపోయడమేంటని చర్చించుకున్నారు. మట్టితో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
