జగిత్యాలలో నిన్నటి బీడు.. వనమైంది నేడు

జగిత్యాలలో నిన్నటి బీడు.. వనమైంది నేడు

ఒకప్పుడు అదంతా బీడు నేల. అక్కడికి వెళ్తే బీటలు వారిని భూమి కనిపించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రూపురేఖలు మారిపోయాయి. ఔషధ మొక్కలు, రకరకాల చెట్లు వెల్‌‌కం చెబుతున్నాయి. పూలమొక్కలతో ఆ ప్లేస్‌‌ చాలా బ్యూటిఫుల్‌‌గా ఉంది. జగిత్యాలకు దగ్గర్లోని టీఆర్‌‌‌‌ నగర్‌‌‌‌.

జగిత్యాల శివార్లలోని 48వ వార్డుకు తారక రామారావు అని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో‌‌ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పేదల కోసం అక్కడ స్థలాలు ఇచ్చారు. ఈ మధ్యే ఆ కాలనీని మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ఆ కాలనీ అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టారు. కాలనీలోని రెండు ఎకరాల భూమిని ప్రకృతి వనంగా మార్చారు. 400 రకాల మొక్కలు నాటారు. వాటిల్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు ఉన్నాయి. 

కేవలం మొక్కలు నాటించడమే కాకుండా వాటి సంరక్షణను దగ్గరుండి చూసుకున్నారు అధికారులు. సేంద్రియ ఎరువులను వాడుతూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్, ఆవు, గొర్రె పెంట వంటి పూర్తి సేంద్రియ ఎరువులను వాడుతూ డ్రిప్ సిస్టమ్ ద్వారా నీరు  పెడుతున్నారు. “ యాదగిరి గుట్ట తరహా మియావాకి ప్లాంటేషన్ ఏర్పాటులో ఆఫీసర్ల సహకారం చాలా ఉంది. పట్టణ వాసులకు గ్రామాల్లో లభించే స్వచ్ఛమైన గాలి పట్టణంలో అందించే ప్రయత్నం చేశాం” అని మున్సిపల్ కమీషనర్ స్వరూప రాణి  చెప్పారు.

::: జగిత్యాల, వెలుగు