చేర్యాలలో పేద మహిళ ఇంటికెళ్లి సమస్యలు తెలుసుకున్న గవర్నర్

చేర్యాలలో పేద మహిళ ఇంటికెళ్లి సమస్యలు తెలుసుకున్న గవర్నర్

సిద్దిపేట, వెలుగు: గవర్నర్ పర్యటనలో మరోసారి ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. తమిళిసై గురువారం మొట్టమొదటిసారి సిద్దిపేట జిల్లాలో పర్యటించగా అధికారులెవరూ హాజరుకాలేదు. ఉదయం 10:30 గంటలకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్, ఇన్​చార్జ్ సీపీ, ఇతర అధికారులెవరూ రాలేదు. ఆలయంలో పూజలు నిర్వహించి పట్నాలు వేసిన అనంతరం 11 గంటలకు గవర్నర్ బైరాన్ పల్లికి బయలుదేరారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంపై గవర్నర్ ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఈ విషయం మీకు తెలిసిందే కదా” అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు వినతి పత్రం ఇవ్వగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారు. 

మేడమ్.. ఇల్లు ఇప్పించండి..  

కొమురవెల్లి నుంచి బైరాన్ పల్లికి వెళ్లిన గవర్నర్.. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరుల కుటుంబాలను సన్మానించారు. వారితో కొద్దిసేపు తెలుగులో మాట్లాడారు. బైరాన్ పల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గవర్నర్ హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో చేర్యాల పట్టణంలో ఎస్సీ కాలనీకి చెందిన నిరుపేద మహిళ మల్లిగారి సంధ్య గవర్నర్ కాన్వాయ్ ని ఆపింది. తనకు ఇల్లు మంజూరు చేయించాలని గవర్నర్ ను కోరింది. ప్రస్తుతం తాము ఉంటున్న ఇల్లు చూడాలని కోరగా.. గవర్నర్ కారు దిగి సంధ్య ఇంటికి వెళ్లారు. ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.