
వన్డేల్లో పేసర్లు ఆరంభంలో, చివర్లో బౌలింగ్ చేస్తారు.. స్ట్రయిక్, స్లాగ్ వికెట్లు తీయడం వాళ్ల పని.. అవసరమైతే పార్ట్‌టైమర్లు ఓ నాలుగైదు ఓవర్లు వేస్తారు. ఒకవేళ సక్సెస్ అయితే బ్యాట్స్‌మన్ లయను దెబ్బతీసి ఒకటి, అరా వికెట్లు తీయడం లేదా రన్స్‌ను నియంత్రించడం వీళ్ల పని..! కానీ 10 నుంచి 40 ఓవర్ల మధ్య వన్డే మ్యాచ్‌ను కాపాడేదెవరు? అంటే దీనికి సమాధానం స్పిన్నర్లు అని చెప్పక తప్పదు. ఒకప్పుడు ప్రతి జట్టులో ఫింగర్ స్పిన్నర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్లను మించి మణికట్టు మంత్రగాళ్లు వచ్చేశారు. ఇలాంటి స్పిన్నర్లు మిగతా జట్లలో లేకపోయినా.. టీమిండియాలో మాత్రం చహల్–కుల్దీప్ ట్రంప్‌కార్డుల్లా మిగిలారు. రెండేళ్ల కిందట శ్రీలంకలో మొదలైన వీళ్ల వికెట్ల ప్రవాహం అత్యున్నత స్థాయికి చేరింది. పరిస్థితులు ఎలా ఉన్నా.. బంతితో మ్యాజిక్ చేయడంలో సిద్ధహస్తులుగా మారిపోయారు. క్రికెట్ వరల్డ్ ఆశ్చర్యపోయేలా విజయాలు సాధించి ఇండియాకు ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లుగా అవతరించారు. మిగతా జట్లు కూడా మణికట్టు స్పిన్నర్లను
వెతుక్కునే పరిస్థితులను తీసుకొచ్చిన కుల్చా జోడీ ఇప్పుడు తమ కెరీర్‌లోనే అత్యంత పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నది. ఈ పరీక్షలో వీళ్లు పాసవుతారా? వన్డేల్లో వీళ్ల ఫెర్ఫామెన్స్ ఎలా ఉందో
ఓసారి పరిశీలిద్దాం..!
కుల్దీప్ కహానీ…
బేబీ ఫేస్ కుల్దీప్.. ఓ అరుదైన చైనామన్ బౌలర్. ఒకప్పటి బ్రాడ్‌హాడ్జ్, పాల్ ఆడమ్స్‌లకు నయా ప్రతినిధి. 2017లో వన్డేల్లోకి వచ్చిన ఈ యూపీ బౌలర్.. ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచి రెండేళ్లలోనే వరల్డ్‌కప్ స్థాయికి ఎదిగాడు. ధర్మశాలలో ఆసీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి ఎవరికి అర్థంకానీ ఓ బంతితో డేంజర్ మ్యాన్ వార్నర్‌ను ఔట్ చేయడంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. కేవలం ఐదు నెలల కాలంలోనే అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడంటే కుల్దీప్ ప్రతిభ ఎంటో అర్థమవుతుంది. ఇప్పటివరకు ఒక్క ఫార్మాట్‌లోనూ అతను విఫలం కాలేదు. టీ20ల్లో కుల్దీప్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లండ్ జట్టు ప్రత్యేకంగా ఓ బౌలింగ్ మిషన్‌నే తెచ్చుకుందంటే అతని నైపుణ్యాన్ని స్పెషల్‌గా చూడాల్సిందే. తనకు మాత్రమే సాధ్యమైన యాక్షన్, బంతుల్లో వేరియేషన్, ఫ్లిప్పర్, గూగ్లీ, టాప్ స్పిన్, ఆఫ్ కట్టర్స్ వేయడంలో కుల్దీప్‌ను మించినోడు లేడు. 44 వన్డేలు ఆడిన కుల్దీప్ 21.74 సగటుతో 87 వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడం, జట్టుకు అవసరమైనప్పుడు వికెట్లు తీయడం అతని ప్రధాన లక్షణం. ప్రపంచంలో ప్రతి జట్టుపై తనదైన ప్రభావం చూపిన కుల్దీప్‌కు ఇంగ్లండ్‌లోనూ మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో చెలరేగాడు. నాటింగ్‌హామ్‌లో జరిగిన వన్డేలో (6/25) బెస్ట్ ఫెర్ఫామెన్స్ నమోదు చేశాడు. చహల్‌తో కలిసి ఎన్నో విజయాలు అందించిన కుల్దీప్.. బంతిని బాగా టర్న్ చేస్తాడు. ధోనీ ఇచ్చే సలహాలు, సూచనలు కూడా అతని బౌలింగ్ మెరుగుపడటానికి చాలా దోహదం చేశాయి. ఇటీవల ఐపీఎల్‌లో విఫలమైనా.. ఈ వరల్డ్‌కప్‌లో అతను కచ్చితంగా రాణిస్తాడని మాజీల నమ్మకం.
చల్..చల్.. చహల్…
తనకు తానుగా మారిన గొప్ప లెగ్గీ చహల్. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, ఊరించే ఫ్లైట్ డెలివరీ, క్యారమ్ బాల్స్.. వికెట్లకు సూటిగా బంతులు వేస్తూ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడంలో మహా దిట్ట. మిడిల్ ఓవర్లలో కుల్దీప్‌తో జత కడితే ఆపడం కష్టం. లెఫ్ట్–రైట్ బౌలింగ్‌తో డెడ్లీ కాంబినేషన్‌గా మారిపోతారు. పవర్‌ప్లేలో పేసర్లు పెట్టే ఒత్తిడిని మ్యాచ్ మధ్యలో కూడా జారకుండా చూస్తాడు. పిచ్ కొద్దిగా స్పిన్‌కు అనుకూలిస్తుందని తెలిస్తే పది ఓవర్లలోపు బౌలింగ్ చేయడానికి కూడా వెనుకాడని నైజం చహల్ సొంతం. భిన్నమైన రన్నప్‌తో హాఫ్ పిచ్‌లో బంతిని వేసి రెండువైపులా టర్న్ చేస్తాడు. ఎక్కువగా లెగ్ బ్రేక్ బంతులు వేసినా.. ఏమాత్రం ఖాళీ దొరికినా, లైన్ మిస్సయినా నేరుగా వికెట్లు గిరాటేయాల్సిందే. వికెట్లు పడకపోయినా అలుపు లేకుండా బౌలింగ్ చేసే ఓపిక, కోపం లేకపోవడం, వ్యూహాన్ని తూచ తప్పకుండా అమలు చేసే నేర్పరితనం చహల్‌ను ప్రత్యేక బౌలర్‌గా నిలిపింది. చహల్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ ఫ్రంట్‌ఫుట్‌తో ఎదురుదాడి చేయాలని చూస్తే మాత్రం తన గొయ్యి తాను తీసుకున్నట్లే. మూడేళ్ల అంతర్జాతీయ కెరీర్ (2016 అరంగేట్రం)లో అత్యుత్తమైన బ్యాట్స్‌మన్‌ను ఎదుర్కొన్నాడు. కొన్నిసార్లు జట్టులో చోటు కోల్పోయినా.. అవకాశం దక్కినప్పుడల్లా సత్తా చూపాడు. స్వదేశంలో టీమిండియా సాధించిన విజయాలను పక్కనబెడితే.. విదేశాల్లోనూ ప్రధాన ఆయుధం చహలే. తన కెరీర్‌లో సాధించిన రెండు ఐదు వికెట్ల ఫెర్ఫామెన్స్ అక్కడే రావడం విశేషం. ముఖ్యంగా దక్షిణాఫ్రికా గడ్డపై ఇండియా తొలి వన్డే సిరీస్‌ను దక్కించుకోవడంలో చహల్‌దే కీలక పాత్ర. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చహల్ 14 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్‌పైనా కూడా తన ఐదు వికెట్ల ప్రతిభను చూపెట్టి వన్డే సిరీస్‌ను గెలిపించి పెట్టాడు. ఆరంభంలో పేసర్లు వికెట్లు తీయకపోతే.. కోహ్లీ ఠక్కున బంతిని చహల్‌కు ఇస్తాడు. ఐపీఎల్‌లో ఓ మాదిరిగా రాణించిన చహల్.. ఇప్పుడు మెగా టోర్నీలో టీమిండియా ట్రంప్ కార్డు. ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ కూడా అతనే.