
సోమవారం ( ఆగస్టు 11 ) సాయంత్రం హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని సికింద్రాబాద్, కూకట్ పల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత కొద్దిరోజులుగా సాయంత్రం సమయంలో కురుస్తున్న వర్షానికి హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. రానున్న నాలుగైదు రోజులపాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరిత ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని.. సోమవారం, మంగళవారం ( ఆగస్టు 11, 12 ) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. బుధవారం ( ఆగస్టు 13 ) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని... దీంతో 13వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
13, 14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 14వ తేదీ ఒకటి రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఇదిలా ఉండగా.. ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.