తిరువనంతపురం: సోషల్ మీడియాలో ఓ యువతి పోస్ట్ చేసిన వీడియో ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? అసలా వ్యక్తి ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడో తెలియాలంటే ఈ వార్త చదవాలి.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన దీపక్ (42) అనే వ్యక్తి ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. జర్నీ టైమ్‌లో బస్సులో దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
దీపక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను అటువంటి వాడిని కాదని.. అవమానభారం భరించలేక దీపక్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీపక్ ఒక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడని, శుక్రవారం తన పని నిమిత్తం కన్నూర్‌కు వెళ్లాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. తన కొడుకు అలాంటి వాడు కాదని.. చేయని తప్పుకు అన్యాయంగా చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరలైన వీడియో చూసి రెండు రోజులు అన్నం కూడా తినలేదని.. తీవ్ర మానసిక వేదనకు గురై చివరకు ప్రాణాలు తీసుకున్నాడని వాపోయారు.
అతను నిర్దోషి అని, ఆ వీడియో వల్ల కలిగే అవమానాన్ని భరించలేకపోతున్నానని చెప్పారు. తన కుమారుడి మృతికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసి దీపక్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు యువతిపై కేసు నమోదు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు యువతి చేసిన దాంట్లో తప్పేం లేదంటుండగా.. అసభ్యంగా ప్రవర్తించి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
