యుద్ధంలో కొందరు చస్తారు.. ఇరాన్ ప్రతీకార దాడులకు అమెరికన్లు సిద్ధంగా ఉండాలే: ట్రంప్

యుద్ధంలో కొందరు చస్తారు.. ఇరాన్ ప్రతీకార దాడులకు అమెరికన్లు సిద్ధంగా ఉండాలే: ట్రంప్

ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. అమెరికా గడ్డపై ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం అమెరికన్లలో ఆందోళన రేకెత్తిస్తోంది. 

కొంతమంది చనిపోక తప్పదు:
అమెరికాలో అంతర్గత దాడులు జరిగే అవకాశం ఉందా అని అడిగినప్పుడు.. "అవును, జరగొచ్చు" అని ట్రంప్ నేరుగా చెప్పారు. తాము దీని గురించి నిరంతరం ఆలోచిస్తున్నాం, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. యుద్ధానికి వెళ్లినప్పుడు కొంతమంది చనిపోక తప్పదు అంటూ ట్రంప్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. యుద్ధం అంటేనే ప్రాణనష్టం అని.. దానికి అమెరికన్లు సిద్ధంగా ఉండాలని పరోక్షంగా పిలుపునిచ్చారు.

ఇరాన్ కొత్త నాయకుడి ఎంపికలో అమెరికా పాత్ర:
ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత.. ఇరాన్‌కు కొత్త నాయకుడిని ఎంచుకోవడంలో అమెరికా ప్రమేయం ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు. మరో ఖమేనీని చూడటం తనకు ఇష్టం లేదని.. ఇరాన్ ప్రజలు నాయకుడిని ఎంచుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి అమెరికాకు అనుకూలంగా ఉండాలంటున్నాడు ట్రంప్. ఇరాన్ భవిష్యత్తును అమెరికా నిర్దేశిస్తుందని ఆయన మాటలు సూచిస్తున్నాయి.

అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికాలో భారీ ఎత్తున భౌతిక దాడులు జరిగే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. ఇరాన్ అనుకూల వర్గాలు టార్గెటెడ్ అటాక్స్ లేదా సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం లేదా ప్రభుత్వ నెట్‌వర్క్‌లను నిలిపివేయడం వంటి 'హ్యాక్టివిజం' పెరగవచ్చని నిఘా వర్గాలు అంటున్నాయి.

ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయ్ మాత్రం అమెరికన్లకు భరోసా ఇస్తున్నారు. అమెరికా గడ్డపై ఎలాంటి ముప్పు కలగకుండా నిరంతరం నిఘా ఉంచుతున్నామని, శత్రువుల కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు హామీ ఇస్తున్నారు. ఇప్పటికే కువైట్‌లోని అమెరికా స్థావరంపై జరిగిన దాడిలో 6 మంది అమెరికన్లు మరణించడంతో.. అమెరికాలో సెక్యూరిటీని హైఅలర్ట్స్ స్థాయికి పెంచేశారు అధికారులు.