T20 World Cup 2026: స్టార్క్ రిటైర్మెంట్.. కమ్మిన్స్‌కు గాయం: వరల్డ్ కప్ ముందు బలహీనంగా ఆసీస్ బౌలింగ్

T20 World Cup 2026: స్టార్క్ రిటైర్మెంట్.. కమ్మిన్స్‌కు గాయం: వరల్డ్ కప్ ముందు బలహీనంగా ఆసీస్ బౌలింగ్

ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.స్టార్ ఫాస్ట్ బౌలర్, మాజీ టీ20 కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ మెగా టోర్నీలోని గ్రూప్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. గాయం కారణంగా ఇటీవలే యాషెస్ సిరీస్ లో ఒకటే టెస్ట్ మ్యాచ్ ఆడిన కమ్మిన్స్ ప్రస్తుతం పూర్తిగా కోలుకోలేదు. టోర్నీ సమయానికి కమ్మిన్స్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ ఆసీస్ స్టార్ పేసర్ ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత సమాచార ప్రకారం కమ్మిన్స్ వరల్డ్ కప్ లోని గ్రూప్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. 

"టోర్నమెంట్‌ సమయానికి కమ్మిన్స్ వరల్డ్ కప్ జట్టులో చేరకపోవచ్చు. టోర్నీలో మూడు లేదా నాలుగు మ్యాచ్ లకు దూరం కానున్నాడు". అని చీఫ్ సెలక్టర్ బెయిలీ అన్నాడు. కమ్మిన్స్ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. చివరి 6 నెలల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. త్వరలో పాకిస్థాన్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం కమ్మిన్స్ పాకిస్థాన్ వెళ్లడం లేదు. వరల్డ్ కప్ లోని నాకౌట్ మ్యాచ్ లు ఆడేందుకు కమ్మిన్స్ శ్రమిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్  ప్రకటించాడు. తాజాగా కమ్మిన్స్ కూడా లేకపోవడంతో ఆసీస్ పేస్ బౌలింగ్ కొంచెం బలహీనంగా మారింది.

2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. వరల్డ్ కప్ కు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టీమిండియాతో పాటు దాదాపు అన్ని జట్లు వరల్డ్ కప్ కు తమ స్క్వాడ్ ను ప్రకటించేశాయి. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి 20 జట్లు పోటీ పడుతుండడంతో ఈ మెగా టోర్నీకి భారీ హైప్ నెలకొంది. 

ఈ సారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి. 

2026 టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా