‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్’ స్టడీలో వెల్లడి
న్యూఢిల్లీ: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా టీకాను సింగిల్ డోస్ వేసుకున్నా.. వైరస్ తో చనిపోయే ప్రమాదం 80 శాతం వరకూ తగ్గుతుందని సోమవారం ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)’ సంస్థ వెల్లడించింది. అలాగే ఫైజర్ బయో ఎన్ టెక్ టీకా సింగిల్ డోస్ తో 80 శాతం, రెండు డోస్ లతో 97 శాతం మరణించే ప్రమాదం తగ్గుతుందని కూడా తమ స్టడీల్లో తేలినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గత డిసెంబర్, ఏప్రిల్ నెలల మధ్య కొత్త సింప్టమాటిక్ కేసులు, పాజిటివ్ వచ్చి, 28 రోజుల్లోపు చనిపోయినవారు, వ్యాక్సినేషన్ స్టేటస్ వంటివి స్టడీ చేయగా వచ్చిన ఫలితాలను బట్టి.. ఈ అంచనాలను రూపొందించినట్లు పీహెచ్ఈ తెలిపింది. అలాగే 80 ఏళ్లకు పైబడిన వాళ్లు ఫైజర్ బయో ఎన్ టెక్ టీకా తీసుకుంటే హాస్పిటల్ లో చేరే ప్రమాదం 93% తక్కువగా ఉంటుందని తమ స్టడీలో తేలినట్లు వివరించింది. కరోనా సోకడానికి వారం రోజుల ముందు సెకండ్ డోస్ ఫైజర్ టీకా తీసుకున్నోళ్లకు కూడా మరణించే ప్రమాదం 69% తగ్గుతుందని వివరించింది. అయితే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకుంటే మరణించే ప్రమాదం ఎంత తగ్గుతుందన్న కోణంలో ఇదే ఫస్ట్ స్టడీ అని పీహెచ్ఈ తెలిపింది.
