వన్ ఎర్త్ – వన్ హెల్త్ నినాదం : ఆస్ట్రేలియాలో మోడీ ప్రకటన

 వన్ ఎర్త్ – వన్ హెల్త్ నినాదం : ఆస్ట్రేలియాలో మోడీ ప్రకటన

ఒకటే భూమి.. ఒకటే ఆరోగ్యం నినాదంతో ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానిదే అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మే 22వ తేదీ మంగళవారం ఆస్ట్రేలియా దేశంలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు మోడీ. ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా..భారతదేశం స్పందిస్తుందన్నారాయన. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ ఇండియాలోనే జరిగిందని స్పష్టం చేశారు ప్రధాని మోడీ.

పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని.. అందులో భాగంగానే సౌర విద్యుత్ తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తూ.. పర్యావరణాన్ని రక్షిస్తుందని వెల్లడించారాయన. భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చటం.. తన లక్ష్యం, కలగా చెప్పారాయన.

కామన్ వెల్త్, కర్రీ, క్రికెట్ అనేవి భారత్ – ఆస్ట్రేలియా దేశాలను కలుపుతున్నాయని.. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ అనేది కూడా రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని వివరించారు ప్రధాని మోడీ. భారత్ – ఆస్ట్రేలియా దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని.. ఇది రెండు దేశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు మోడీ. ప్రపంచంలోని ఏ దేశం అయినా ఆపదలో ఉందీ అంటే మొదటగా స్పందించేది భారత్ మాత్రమేనన్నారాయన.అందుకే భారత్ ను విశ్వగురుగా గుర్తిస్తున్నారని స్పష్టం చేశారు మోడీ.