- కార్పొరేట్ కాలేజీల ఫీజుల మాయాజాలం
- పేరెంట్స్ ను ఇబ్బందులు పెడుతున్న మేనేజ్మెంట్లు
- ఫీజులను నియంత్రించాలని తల్లిదండ్రుల వేడుకోలు
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలో ఎంపీసీ కోర్సులో కామారెడ్డికి చెందిన వెంకట్ రెడ్డి తన కొడుకుని చేర్పించాడు. చేరిన సమయంలో ఫీజు రూ.2.25లక్షలు, ఇతర ఖర్చులకు రూ.25వేలు ఫీజు ఉంటుందని చెప్పారు.ఆ ఫీజును ఆయన చెల్లించారు. ఇటీవలే సెకండియర్‌లో మరో రూ.50వేలు ఎక్కువ కట్టాలని కాలేజీ ప్రతినిధి ఫోన్ చేసి చెప్పారు. ఎందుకు కట్టాలంటే వచ్చి మాట్లాడు కోవాలంటూ ఫోన్ పెట్టేశారు.
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కార్పొరేట్ ఇంటర్మీడియెట్ కాలేజీల ఫీజుల మాయాజాలం రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఫస్టియర్‌లో ఒక ఫీజు చెప్పి, సెకండియర్ లో మరో ఫీజు వసూలు చేస్తూ పేరెంట్స్‌ను ఇబ్బందులు పెడుతున్నాయి. వివిధ రకాల పేర్లతో పేరేంట్స్ నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇటు బోర్డు గానీ, అటు సర్కారు గానీ ఇంటర్మీడియెట్ కాలేజీల ఫీజులు నియంత్రించక పోవడంతో మేనేజ్మెంట్ల ఇష్టారాజ్యం కొనసాగుతున్నది.
అనుమతులు లేకుండానే హాస్టళ్లు
రాష్ట్రంలో సుమారు1400 వరకూ ప్రైవేటు ఇంటర్ కాలేజీలుండగా, వాటిలో300 వరకూ కార్పొరేట్ కాలేజీలున్నాయి. వీటికితోడు మరిన్ని అనధికార కాలేజీలు వాటికి అనుబంధంగా కొనసాగుతున్నాయి. వీటిలో ఎంసెట్, జేఈఈ, నీట్.. ఇలా పలు రకాల పేర్లతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా అడిగే వారే కరువయ్యారు. ఒక్కో కాలేజీలో రూ.లక్షన్నర నుంచి మూడున్నర లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు.
మరోపక్క ఎవరి అనుమతులు లేకుండానే హాస్టళ్లు కొనసాగుతున్నాయి. గతేడాది ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకున్నప్పుడు హడావుడి చేసిన ఇంటర్ బోర్డు అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆ తర్వాత మరిచిపోయారు. అయితే, ఇదంతా ఒకవైపు వసూళ్ల దందా అయితే, తాజాగా కొత్త దందాకు మేనేజ్మెంట్లు తెరలేపాయి.
ముందే కొంత కట్టాలె
ఇంటర్ ఫస్టియర్‌లో ఒక ఫీజు చెప్పి స్టూడెంట్లను జాయిన్ చేసుకొని, సెకండియర్ లో ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నాయి. ఫస్టియర్‌లో తాము ఎంతకట్టాలనే దానికి ప్రత్యేకంగా రిసిప్ట్లు ఇచ్చినా, అవేవీ పట్టించుకోకుండా రూ.30వేల నుంచి రూ.70వేల వరకూ అదనంగా వసూలు చేస్తున్నట్టు పేరెంట్స్ చెప్తున్నారు. మధ్యలో స్టూడెంట్లను తీసివేయ్యలేరనే ధీమాతో ఇలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించినా, పై నుంచి వచ్చిన ఆదేశాలంటూ కాలేజీ సిబ్బంది తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. పిల్లల్ని ఇంటికి తీసుకుపోవాలంటే ఫీజు కొంత కట్టాలంటూ హుకుం జారీ చేశారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. త్వరలోనే సెకండియర్ క్లాసులు ప్రారంభిస్తామని, వచ్చేటప్పుడు ఫీజు తీసుకొని రావాలని మేనేజ్మెంట్లు పేరెంట్స్‌ను ఆదేశించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందాను ఆపాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
