వీఆర్ఏల ఆందోళనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు

వీఆర్ఏల ఆందోళనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు

కాళేశ్వరం పేరుతో 1.15 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అవినీతిలో ఎవరినైనా జైలుకు పంపించాలంటే ముందుగా సీఎం కేసీఆర్ నే పంపించాల్సి ఉంటుందన్నారు. నీట మునిగిన పంప్ హౌస్ లను చూడడానికి వెళ్తుంటే పోలీసులు భూపాలపల్లి దగ్గరే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. గొడ్డు చాకిరి చేస్తున్న వీఆర్వోలపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో చులకన చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీఆర్ఏలు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని..పే స్కేల్ ఇవ్వమని కోరుతున్నారని తెలిపారు. హనుమకొండ ఏకశిళా పార్క్ వద్ద వీఆర్ఏల నిరసన శిబిరాన్ని సందర్శించిన ప్రవీణ్ కుమార్..వారి ఆందోళనకు మద్దతు ప్రకటించారు. 

దేశంలో ఎక్కువ జీతం తీసుకుంటూ..తక్కువ రోజులు సచివాలయానికి వెళ్లే సీఎం..కేసీఆర్ మాత్రమే అని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సీఎం తన ఇంటి నుంచి  ఫామ్ హౌస్ వెళ్లేందుకు ఏడాదికి 79 కోట్ల ప్రజా ధనం ఖర్చు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని మిగులు, అసైన్డ్ భూములను సీఎం కేసీఆర్ తన చేతుల్లోకి తెచ్చుకునే కుట్రలో భాగమే ధరణి పోర్టల్ అని ఆరోపించారు. ఈ భూములు తమ పేర్లపై మార్చుకునేందుకే వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారన్నారు. ఇది మొత్తం తెలంగాణ ప్రజలపై జరిగిన కుట్రగా చూడాలని చెప్పారు. తన కొడుకును సీఎం చేయాలని, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలని తన వారసత్వం కోసం ఆలోచిస్తున్న కేసీఆర్..వారసత్వ ఉద్యోగాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.