
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా టూర్‌లో ఇండియాకు అతిపెద్ద సవాళ్లు ఎదురవుతాయని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో కంగారూల బలం చాలా పెరిగిందన్నాడు. దీన్ని ఎదుర్కోవాలంటే కోహ్లీసేన సర్వ శక్తులు ఒడ్డాల్సిందేనన్నాడు. అయితే గతంతో పోలిస్తే టీమిండియా బౌలింగ్ ఇంప్రూవ్ కావడం సానుకూలాంశమని చెప్పాడు. ‘ఈసారి సిరీస్‌లో హోరాహోరీ తప్పదు. ఎందుకంటే బాల్ ట్యాంపరింగ్ బ్యాన్ తర్వాత స్మిత్, వార్నర్ మరింత మెరుగ్గా ఆడుతున్నారు. కాబట్టి ఇది గొప్ప సిరీస్‌గా మిగిలిపోతుంది. విరాట్ గ్యాంగ్ లాస్ట్ టైమ్ గొప్ప విజయం సాధించింది. అందువల్ల ఈసారి లెక్కసరిచేయాలని ఆసీస్ కూడా చాలా పట్టుదల చూపెడుతుంది. దీంతో ఈ ఏడాదికే ఇది పెద్ద సిరీస్‌గా నిలుస్తుంది.
టెస్ట్ సిరీస్ టైమ్‌కు కరోనా ప్రతికూల పరిస్థితులన్నీ అదుపులోకి వస్తాయనే నమ్మకం ఉంది. మొత్తానికి రెండు టాప్ క్లాస్ టీమ్స్ మధ్య చాలా గట్టిపోటీ చూడబోతున్నాం. స్మిత్, వార్నర్ రాకతో బ్యాటింగ్ బలం పెరిగితే.. అక్కడి పిచ్‌లపై కంగారూల పేసర్లను ఎదుర్కోవడం కూడా తలకు మించిన పనే అవుతుంది. గత సిరీస్‌లో బ్యాటింగ్ సమస్యల వల్ల ఆసీస్ చాలా ఇబ్బంది పడింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో బౌలర్లకు పట్టు సాధించే సమయం ఇవ్వలేకపోయారు. ఈ సారి మాత్రం అలా జరగదు. మరోపక్క ఇండియా బౌలింగ్ కూడా ఊహించిన దానికంటే ప్రమాదకరంగా మారింది. అందువల్ల బ్యాట్, బాల్‌కు మధ్య హోరాహోరీ పోరు ఖాయం అనిపిస్తుంది’ అని ద్రవిడ్ వివరించాడు.
అప్పుడు వాళ్లు లేకపోవడం లోటే..
2018-–19 ఆసీస్ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను విరాట్‌సేన 2–1తో సొంతం చేసుకుంది. దీంతో 71 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. అయితే ఆ టైమ్‌లో స్మిత్, వార్నర్ బ్యాన్ కారణంగా టీమ్‌కు అందుబాటులో లేరు. దీంతో లాస్ట్ టైమ్ సిరీస్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తమ బెస్ట్ ప్లేయర్స్ స్మిత్, వార్నర్ లేడని ఆసీస్ పదేపదే గుర్తు చేస్తుంది. దీనిపై ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘ఓ రకంగా ఇది ఒప్పుకోవాల్సిన అంశమే. ఎందుకంటే అప్పట్లో ఈ ఇద్దరు వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు. ఒకేసారి వాళ్ళు అందుబాటులో లేకపోయే సరికి ఆసీస్ చాలా బలహీనమైంది. అప్పుడు మనం సిరీస్ గెలవడాన్ని ఆసీస్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి అలా కాదు. ఇప్పుడు ఇరుజట్లలోనూ బెస్ట్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పటికే యాషెస్‌లో స్మిత్ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపెట్టాడు. వార్నర్ కూడా మొదలుపెడితే మన బౌలర్లకు కఠిన పరీక్ష తప్పదు. ఈ పరీక్షను ఎదుర్కొనే సత్తా మన బౌలర్లకు ఉందనే నమ్ముతున్నా’ అని ఈ కర్ణాటక మాజీ ప్లేయర్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా
సీఎం కేసీఆర్‌పై అసభ్యకర పోస్టింగ్స్ చేసిన వ్యక్తి అరెస్టు