కారులో వచ్చి పందులు చోరీ.. ముఠాలోని ఒకరు అరెస్ట్

కారులో వచ్చి పందులు చోరీ.. ముఠాలోని ఒకరు అరెస్ట్

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: పందులను చోరీ చేసిన ముఠాలోని ఒకరు అరెస్ట్ అయ్యారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన కుత్తాడి విక్రమ్(27), పెద్ద అంబర్ పేట్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో షెడ్ లో పందుల పెంపకం చేపట్టాడు. ఈనెల 4న షెడ్ లోని 10 పందులు కనిపించలేదు. చోరీ అయినట్టు అనుమానించి పలుచోట్ల వెతికాడు. స్థానికంగా సీసీ ఫుటేజ్ లను చెక్ చేస్తే.. కొందరు కారులో వచ్చి పందులను ఎత్తుకెళ్లినట్టు తేలింది. 

దీంతో బాధితుడు వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  దర్యాప్తులో భాగంగా గురువారం ముఠాలోని ఒకరిని అరెస్టు చేశారు. ఐదుగురు వ్యక్తులు పందులను చోరీ చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు చేపట్టామని చెప్పారు.  చోరీ అయిన పందుల విలువ సుమారు రూ.3.36 లక్షలు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు.