
హైదరాబాద్, వెలుగు: క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శంషాబాద్ ఎయిర్ పోర్డులోని రోటరీ వద్ద రిజిస్ట్రేషన్ లేని క్యాబ్ (టీఎస్10 యుబి6799)లో ప్రయాణికులను ఎక్కిస్తుండగా పోలీసులు డ్రైవర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో డ్రైవర్ వారిని తప్పించుకునే క్రమంలో.. వెనుక ఉన్న వాహనాన్ని తన కారుతో ఢీ కొట్టాడు. కారు ఎక్కడానికి ప్రయత్నించిన ప్యాసింజర్ కొమ్ము యాదయ్యను పట్టించుకోలేదు. అలానే ముందుకు వెళ్లడంతో యాదయ్య చొక్కా కారులో ఇరుక్కుపోయింది. దీన్ని గమనించకుండా డ్రైవర్
కారు నడిపాడు. అలానే ఈడ్చుకుంటూ వెళ్ళడంతో యాదయ్య ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కిషన్ గూడ టోల్ గేట్ వద్దకు డ్రైవర్ చేరుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన ఇతర వాహనదారులు అతడిని ప్రశ్నించడంతో..కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. చనిపోయిన కొమ్ము యాదయ్య.. మహేశ్వరం మండలం నంది పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని గుర్తించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.