
హామిల్టన్: ఓ అడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కి వేస్తున్న ఇండియా విమెన్స్ టీమ్ వన్డే వరల్డ్‌కప్‌లో కీలక మ్యాచ్‌కు రెడీ అయింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే గెలుపు అనివార్యం అయిన పరిస్థితుల్లో మంగళవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పోటీ పడనుంది. టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన ఐదింటిలో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మూడింటిలో ఓడిన మిథాలీసేన నాలుగు పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది. టాప్4లో ప్లేస్ నిలబెట్టుకోవాలంటే బంగ్లాపై ఇండియా కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే గత రెండు మ్యాచ్‌ల్లో చేసిన పొరపాట్లను మిథాలీసేన వెంటనే సరిదిద్దుకోవాలి. బ్యాటింగ్‌లో నిలకడ లేక ఇబ్బంది పడుతున్న టీమ్‌ను ఆసీస్‌తో గత పోరులో బౌలర్లు దెబ్బకొట్టారు. 277 రన్స్‌ను కూడా కాపాడుకోలేకపోయిన బౌలర్లు వెంటనే పుంజుకోవాలి. హర్మన్‌కు తోడు గత మ్యాచ్‌లో కెప్టెన్ మిథాలీ ఫిఫ్టీతో మళ్లీ టచ్‌లోకి రావడం ప్లస్ పాయింట్. మంచి ఫామ్‌లో ఉన్న యస్తికను తిరిగి ఓపెనర్‌గా పంపించే చాన్సుంది. ఆమెతో పాటు మంధాన మంచి ఓపెనింగ్ ఇస్తే ఇండియా విజయం సులువవుతుంది. తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్న బంగ్లా నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచింది. ఈ నేపథ్యంలో మిథాలీసేన బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించే బంగ్లాపై భారీ విజయం సాధిస్తే కీలకమైన రన్‌రేట్‌ను కూడా పెంచుకోవచ్చు.